బీజింగ్ ఒలింపిక్స్ బాక్సింగ్ విభాగంలో భారత్‌కు చెందిన జితేందర్ కుమార్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అంతకుముందు శుక్రవారం అఖిల్ కుమార్ బాక్సింగ్ విభాగంలోనే క్వార్టర్స్‌కు చేరుకోగా శనివారం జితేందర్ క్వార్టర్స్‌కు చేరుకుని మరో పతకాన్ని భారత్‌కు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉబ్జెకిస్థాన్ బాక్సర్ తుల్షబాయ్ దొనియోరోవ్‌తో జరిగిన 51 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో విజయం సాధించడం ద్వారా జితేందర్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ప్రారంభం నుండి ప్రత్యర్ధిపై బలమైన పంచ్‌లతో విరుచుకుపడిన జితేందర్ చివరివరకు అదే జోరు కొనసాగించాడు.
దీంతో చివరకు 13-6 తేడాతో జితేందర్ విజయవంతంగా క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగు పెట్టాడు. హర్యానాకు చెందిన 20 ఏళ్ల జితేందర్ కుమార్ అంతకుముందు 2006లో మెల్బోర్న్‌లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో కాంస్య పతక విజేత కావడం గమనార్హం.