ఆధునిక ఒలింపిక్ చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్న బీజింగ్ విశ్వ క్రీడా సంరంభానికి తెరపడింది. అబ్బురపరిచే స్థాయిలో ప్రారంభ వేడుకలను నిర్వహించిన చైనా... దాన్ని తలదన్నే రీతిలో ముగింపు ఉత్సవాలను నిర్వహించి క్రీడా ప్రపంచానికి తమ సత్తాను చాటింది. 16 రోజుల పాటు ఉర్రూతలూగించిన సంబరాలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి.
పదహారు రోజులు ఆడారు... పాడారు... పతకాలు కైవసం గెలుచుకున్నారు. తీయని అనుభూతులు పంచుకున్నారు. ఇక సెలవు.... మళ్లీ లండన్‌లో కలుద్దాం.. అంటూ.. హృదయభారంతో వీడ్కోలు తీసుకున్నారు. 29వ ఒలింపిక్స్ ముగింపు సందర్భంగా ఆదివారం చైనా జాతీయ స్టేడియం (బర్డ్స్‌నెస్ట్) ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య విశ్వ క్రీడలకు ముగింపు పలికారు.
ఏకత్వం, స్నేహం, శాంతి అనే ఒలింపిక్ నినాదాల స్ఫూర్తిగా పోరాడిన అథ్లెట్లు బీజింగ్ అనుభవాలను, మధురస్మృతులను తమ మదిలో పదిలపరుచుకుని భారంగా తమతమ స్వదేశాలకు వెనుదిరిగారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ క్రీడలు అటు చైనా చరిత్రలోనే కాకుండా.. ప్రపంచ ఒలింపిక్ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఆద్యంతం అబ్బురపరిచే నృత్యాలు, జిగేల్‌మనే బాణాసంచా వెలుగుల మధ్య నేషనల్ స్టేడియం ప్రత్యేక శోభను సంతరించుకుంది. 91 వేల మందిని ప్రత్యక్షంగాను, కోటానుకోట్ల మంది పరోక్షంగా ఈ వేడుకలను తిలకించి, సంభ్రమాశ్చర్యాల్లో మంత్రముగ్ధులయ్యారు. 204 దేశాలు, 10 వేల మందికిపైగా అథ్లెట్లు, 28 క్రీడల్లో 302 అంశాల్లో తలపడ్డారు. 56 మంది సభ్యులతో బరిలోదిగిన భారత జట్టు.. మెజార్టీ ఆటగాళ్లు విఫలంకాగా... షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణంతోనూ, రెజ్లర్ సుశీల్ కుమార్, బాక్సర్ విజేందర్ కుమార్ రజతాలతో స్వదేశానికి చేరుకున్నారు.
ఇకపోతే.. ఒలింపిక్ చరిత్రలో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టిన చైనా 51 స్వర్ణాలతో క్రీడా ప్రపంచంలో తనకు ఎదురు లేదని చాటిచెప్పింది. 36 పసిడి పతకాలతో అమెరికా ద్వితీయ స్థానంలో ఉండగా, రష్యా మూడో స్థానానికి పరిమితమైంది. అయితే మొత్తంగా 110 పతకాలు సాధించడమే అగ్రరాజ్యానికి ఒకింత ఊరటనిచ్చే విషయం.
ఆరు ప్రపంచ రికార్డులతో ఎనిమిది బంగారు పతకాలు కైవసం చేసుకున్న అమెరికా బంగారు చేప.. మైకేల్ ఫెల్ప్స్, మూడు ప్రపంచ రికార్డులతో మూడు స్వర్ణాలు గెలుపొందిన జమైకా ‘పరుగు వీరుడు’ ఉసేన్ బోల్ట్ ఈ 29వ ఒలింపిక్ క్రీడలకు హైలైట్‌గా నిలిచారు.
2012 లండన్‌లో... బీజింగ్ ముగిసిన విశ్వ క్రీడల అనంతరం తదుపరి క్రీడలకు లండన్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే 2012లో జరిగే ఒలింపిక్స్ కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని లండన్ వాసులు వేడుకగా జరుపుకున్నారు. దాదాపు 40 వేల మంది లండన్ పౌరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఒలింపిక్ పతాకాన్ని అందుకున్న లండన్ మేయర్ బోరిస్ జాన్సన్, ఒలింపిక్ పతాకాన్ని మంగళవారం స్వదేశానికి తీసుకెళ్తారు.