బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో ఇంగ్లీష్, వేల్స్, స్కాటిష్ ప్రాంతాల జెండాలను అభిమానులు ప్రదర్శించడంపై చైనా నిషేధం విధించింది. ఒలింపిక్ క్రీడలు మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న తరుణంలో చైనా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది. అభిమానులు ఒకవేళ వీటితో స్టేడియంలో ప్రవేశిస్తే ఆ పతాకాలను జప్తు చేసుకుంటారు.
బీజింగ్ విశ్వ క్రీడల్లో బ్రిటన్ జాతీయ పతాకాన్ని మాత్రమే అధికారికంగా అనుమతిస్తారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 205 సభ్య దేశాల పతాకాలకు నేరుగా ప్రదర్శించే అవకాశం ఉంది. నిరసనకారులు టిబెట్ పతాకాన్ని ఒలింపిక్స్‌లో చేబూనడంపై చైనా ఇప్పటికే నిషేధం విధించింది. బీజింగ్ క్రీడల్లో వేల్స్ పతాకాన్ని అనుమతించకపోవడాన్ని సైక్లిస్ట్ థామస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒలింపిక్ పతాకం బీజింగ్‌కు చేరుకుంది. చైనా రాజధాని బీజింగ్‌లో దీనికి అభిమానుల నుంచి ఘనమైన మద్దతు లభించింది. ఒలింపిక్ జ్యోతి ప్రపంచ దేశాల పర్యటనలో భాగంగా అనేక చోట్ల నిరసనకారుల ఆగ్రహానికి గురైంది.