బెస్ట్ డాక్యుమెంటరీగా "స్మైల్ పింకీ"కి ఆస్కార్

లాస్ఏంజిల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగిన 81వ ఆస్కార్ వేడుకల్లో... 39 నిమిషాల నిడివితో ప్రదర్శితమైన "స్మైల్ పింకీ" అనే చిత్రం ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో నాలుగు చిత్రాలతో పోటీపడి ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక గ్రహణం మొర్రి కారణంగా నవ్వడమే మరిచిపోగా.. ఒక వైద్యుడు దాన్ని సరిచేసి, తిరిగి ఎలా నవ్వేలా చేశాడన్న కథాంశంతో స్మైల్ పింకీ చిత్రం రూపుదిద్దుకుంది. అంతేగాకుండా, ఆ వైద్యుడు మిగతా పిల్లలందరితో పాటు తాను కూడా సమానమేనన్న ఆత్మవిశ్వాసాన్ని ఆ బాలికలో కల్పిస్తాడు.

పెదవుల వైకల్యంతో పుట్టిన ఓ బాలిక ప్రధాన ఇతివృత్తంతో మేఘన్ మైలాన్ రూపొందించిన స్మైల్ పింకీ... ఆస్కార్‌ను సొంతం చేసుకోవడంతో... ఉత్తరప్రదేశ్‌లోని అహురా జిల్లాకు చెందిన డాబాయ్ గ్రామస్థులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

ఆస్కార్ పోటీలలో నిలదొక్కుకోవడమే గొప్పగా చెప్పుకునే తరుణంలో.. "స్లమ్ డాగ్ మిలీయనీర్" చిత్రం ఎనిమిది ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో భారతీయులందరూ ఆనందోత్సాహాల్లో మునిగి ఉండగానే... స్మైల్ పింకీ రూపంలో మరో ఆస్కార్‌ అవార్డు భారత్ ఖాతాలోకి వచ్చి చేరింది.

వెబ్దునియా పై చదవండి