నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి.
ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి.
ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు. ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు.