భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈనాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి 'రాధాష్టమి' అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తితో గీతాలు ఆలపిస్తారు. ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాధాకృష్ణుల విగ్రహాలను అభరణాలు, నూతన వస్త్రాలతో విశేషంగా అలంకరిస్తారు. అమ్మవారికి విశేష హారతి తర్వాత పవళింపు సేవ నిర్వహిస్తారు.
రాధాష్టమి రోజున రాధాయ నమః అనే ఆరు అక్షరాల మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని, అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతుంది.