సూపర్ మూన్ డే.. కార్తీక సోమవారం.. నిండు పౌర్ణమి.. తిరుమలలో భక్తుల రద్దీ

సోమవారం, 14 నవంబరు 2016 (09:08 IST)
సోమవారం సూపర్ మూన్ డే. కార్తీక సోమవారం, నిండు పౌర్ణమి, సూపర్ మూన్‌డే మూడూ ఒకేసారి కలిసి రావడంతో.. భూమికి చంద్రుడు అతి దగ్గరగా వస్తాడు. చంద్రుడు సూపర్ మూన్ డే రోజైన నేడు అతిపెద్దగా నిండుగా ఆకాశంలో కనిపిస్తాడు. వెన్నెల వెలుగులను మరింత ఎక్కువగా విరజిమ్మిస్తాడు. చాలా అరుదుగా కన్పించే సూపర్‌ మూన్‌ను తిలకించేందుకు తిరుపతి సైన్స్‌ సెంటర్‌ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 
 
భూమికి దగ్గరగా చంద్రుడు వస్తున్నందున సందర్శకులు తిలకించడానికి వీలుగా రెండు టెలిస్కోప్‌లను ఉంచారు. చంద్రుడిపై ఉన్న లోయలను, పర్వతాలను అత్యంత స్పష్టంగా చూడటానికి అవసరమైన క్రేటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు సైన్స్‌ సెంటర్‌ అధికారులు చెప్పారు. తిరుమలలో ప్రతి పౌర్ణమికి జరిగే శ్రీవారి గరుడ సేవ కార్తీక మాసం సందర్భంగా మరింత శోభాయమానంగా జరుగనుంది. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు తిరుమల వెంకన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి