సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం ఆచరించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. గ్రహణ స్పర్శ కాలంలో నదీస్నానం, మధ్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో దానం, స్నానం చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
గ్రహణ కాలంలో భగవంతుడిని స్మరించుకుంటే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపం, ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించాలి. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేసి, గ్రహణ సమయంలో గోదానం, భూదానం లేదంటే చేతనైన దానాలు చేయడం ద్వారా దోషాలు తొలగిపోతాయి.
సూర్యగ్రహణ దోష నివారణకు దానం, హోమం, జపం, దేవతార్చన, అభిషేకం, శక్తి కలిగినవాళ్లు బంగారంతో చేసిన నాగప్రతిమ, శక్తి లేనివారు శిలతో చెక్కిన లేదా పిండితో చేసిన నాగప్రతిమను బ్రాహ్మణునికి, లేదా దేవాలయంలో సూర్యబింబంతో (రాగి, వెండి, బంగారం, స్పటికం) సహా దానం చేయడం మంచి ఫలితాలను పొందవచ్చు.
ఎవరి జన్మ రాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుందో వారు ఔషదాలతో కూడిన స్నానం చేస్తే గ్రహణ దోషం తొలగిపోతుంది. మణిశిల, యాలకులు, దేవదారు, కుంకుమపువ్వు, వట్టివేళ్లు, గోరోచనం, కస్తూరి, కుంకుమ, ఎర్ర పుష్పాలు, ఎర్రగన్నేరు, రక్త చందనం, చెరువు లేదా, పుట్ట మన్ను, గోశాల మట్టి తెప్పించుకుని గ్రహణానికి ముందే కలశంలో ఉంచి దేవతలను ఆవాహనం చేసి ఓం సూర్యాయనమః మంత్రం జపిస్తూ స్నానమాచరించాలి. సూర్యగ్రహణానికి ముందు 12 గంటలు వేదకాలం. ఈ వేదకాలంలో ఆహారం తీసుకోకూడదట.