జూలై 2 సంపూర్ణ సూర్యగ్రహణం... ఎక్కడెక్కడ కనిపిస్తుందో తెలుసా?

మంగళవారం, 2 జులై 2019 (10:16 IST)
సూర్యగ్రహణం సహజంగా పగలు అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు. భారత కాలమానం ప్రకారం జూలై 2, అంటే ఇవాళ మంగళవారం రాత్రి 10.21 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు బుధవారం అర్ధరాత్రి 2.15 నిమిషాలకు సమాప్తమవుతుంది. చైనాతో పాటు అర్జెంటీనా, ఉత్తరమెరికాలోని దక్షిణ ప్రాంతంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు.
 
ఇకపోతే 2019వ సంవత్సరం మొత్తం ఐదు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సంపూర్ణ సూర్య గ్రహణాలు కాగా, ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం. అలాగే ఒకటి పాక్షిక చంద్రగ్రహం, మరొకటి పాక్షిక సూర్యగ్రహణం. ఇక పదమూడేళ్లకు ఒకసారి సూర్యుడు కక్ష్యను దాటి బుధుడు సంచరిస్తాడు. ఇది 2019 నవంబరులో జరుగనుంది.
 
ఈ కొత్త ఏడాది ప్రారంభమైన తొలివారంలోనే సూర్యగ్రహణం సంభవించింది. ఇది జరిగిన 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడింది. జనవరి ఆరో తేదీ (ఆదివారం) పాక్షిక సూర్యగ్రహం ఏర్పడింది. ఇది ఆసియా, ఫసిఫిక్ తీరంలో దర్శనమిచ్చింది. భారత్‌లో మాత్రం ఈ గ్రహణం కనిపించలేదు. ఇది జరిగిన 15 రోజుల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం జనవరి 21న ఏర్పడింది. ఇది కూడా అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో కనిపించింది. 
 
జూలై 2న సంపూర్ణ సూర్య గ్రహణం, జూలై 16న పాక్షిక చంద్రగ్రహణం, డిసెంబ‌ర్ 26, 2019న ఏర్ప‌డే సూర్య గ్ర‌హ‌ణం ఏర్పడనున్నాయి. ఇందులో డిసెంబర్ 26న ఏర్పడే సూర్య గ్రహణం ద‌క్షిణ భార‌తదేశం, శ్రీలంక‌, కొన్ని గ‌ల్ఫ్ దేశాలు, సుమ‌త్రా, మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో క‌నిపించ‌నుంది. కానీ సంపూర్ణ సూర్యగ్రహణం కోసం మ‌రో 16 ఏళ్లు వేచి చూడాల్సి వుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు