వైకుంఠ ఏకాదశికి అంత వైశిష్ట్యం ఎందుకు?

సోమవారం, 26 డిశెంబరు 2022 (19:50 IST)
ఏకాదశిలో వైశిష్ట్యం కలిగినది వైకుంఠ ఏకాదశి. శుక్లపక్షంలో 11వ రోజు వచ్చే ఈ ఏకాదశి ఏడాదిలో వచ్చే ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైనది. ప్రతి ఏడాది ఈ ఏకాదశి డిసెంబర్ లేదా జనవరి మాసాల్లో వస్తుంది. ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేస్తారు. ఈ ద్వార ప్రవేశం చేస్తే మోక్షం లభిస్తుందని ఐతిహ్యం. ఈ ద్వార దర్శనం చేసే వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున ఉపవాసం, జాగరణ, పారణ కీలకాంశాలు. 
 
ఈ ఉపవాసం ద్వారా జాగరణ, పారణ ద్వారా యమబాధలు వుండవు. ఈ ఉపవాసం చేపట్టిన వారి జోలికి యముడు అస్సలు వెళ్లడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేస్తారు. ఇంకా విష్ణుమూర్తి ఆలయాలను సందర్శిస్తారు. అలాగే ఈ రోజున దేశంలోని విష్ణు ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనం.. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తారు. 
 
ఏకాదశి వ్రతంతో ఆరోగ్యానికి చాలామంచిది. ఏకాదశి ముందు రోజు దశమి నుంచే మితమైన ఆహారం తీసుకుని ఏకాదశి రోజు పూర్తి ఉపవసిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ చేస్తారు. మరుసటి రోజు ద్వాదశి ఉదయం సూర్యోదయానికి ముందే పారణ చేసి ఆహారం తీసుకుంటారు. జాగరణ సమయంలో విష్ణుసహస్ర నామాలు, గోవింద నామాలతో జపం చేయాలి. 
 
ఏకాదశి రోజుల్లో నీరు కూడా తీసుకోకుండా వ్రతమాచరించే వారున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి రోజున వ్రతమాచరించే వారు తృణధాన్యాలు, పాలు, పండ్లు తీసుకోవచ్చునని.. అదికూడా మితంగా తీసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ వ్రతానికి గర్భిణీ స్త్రీలు,  వృద్ధులు దూరంగా వుండాలని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు