పనిస్థలాల్లో మెలగడం ఎలా...

శనివారం, 6 డిశెంబరు 2008 (14:09 IST)
రకరకాల మనస్తత్వాలు, భిన్న వైరుధ్యాలు, అహాలు, ఆధిక్యతా భావాలు, వేగవంతమైన పనితీరులో దైనందిన ఒత్తిడులు వంటి వాటికి పనిస్థలం నిలయంగా ఉంటుంది. ఆఫీసుల్లో, కార్యాలయాలలో విభిన్న మనస్తత్వాలు, వ్యక్తిత్వాల మధ్య మహిళలు తమ పనులను సజావుగా చేసుకోవడం కత్తిమీద సాములాగే ఉంటుంది. మన నడవడికను, ప్రవృత్తిని ఆఫీసు వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడంతో పాటు మన శారీరక భాషను కూడా హుందాగా పని స్థలాల్లో ప్రదర్శించవలసి ఉంటుంది.

దీనికి ముందుగా మహిళలు పాటించవలసిన అంశాలు..

చేసే పని ఏదైనా సరే దాన్ని ఒక పనిలా కాకుండా వ్యాపకంలా చేయండి. పనికోసం పని అన్నట్లుగా మీ పనిని పూర్తిగా ఆస్వాదించండి. ఉద్యోగం, పై అధికారి, సహోద్యోగులు, చుట్టూ ఉన్న వాతావరణం మీకు నచ్చవచ్చు లేదా నచ్చక పోవచ్చు. మీ ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా వారంతా మీ ఉద్యోగ జీవితంలో భాగం అనే విషయాన్ని మీరు గుర్తించి తీరాలి. వారిలో మీకు నచ్చని అంశాన్ని పక్కన పెట్టి ముందుగా వారినుంచి ఏం నేర్చుకోవాలో చూడండి

మీ పని పట్ల మీకు నమ్మకం, ఆత్మ విశ్వాసం పెరిగిన తర్వాత ఇప్పుడు చేయవలసింది మీ సామర్థ్యం మీద నమ్మకం పెంచుకోవడం. చేసే ప్రతి పనిలోనూ మీ ప్రత్యేకత చూపండి. మీ సామర్థ్యానికి గర్వించండి.

మిమ్మల్ని మీ చుట్టుపక్కల ఉన్నవారిని ప్రేమించడం, గౌరవించడం నేర్చుకుంటే ఇతరులు మీకు నచ్చడం, నచ్చకపోవడం వంటి మానసిక సమస్యలు తొలగిపోతాయి.

మనసుతో మాట్లాడుకోవడం చాలా అవసరం. రోజు నేను అందంగా ఉంటాను, బాగా పనిచేస్తాను, ప్రశంసలు అందుకుంటాను ఇలా మీ మనసును ట్యూన్ చేసుకుంటే అది మనసు కంప్యూటర్లో స్థిరపడిపోతుంది. అందుకు తగ్గట్టుగా కొత్త ఆలోచనలకు కూడా శ్రీకారం చుడుతుంది.

వెబ్దునియా పై చదవండి