పనుల నిర్వహణలో వాదనకు దిగకండి..

బుధవారం, 19 నవంబరు 2008 (17:10 IST)
ఏ కంపెనీలో అయినా సరే ప్రాజెక్టులు, నిర్దేశిత లక్ష్యాలు పూర్తి చేస్తున్నప్పుడు అభిప్రాయభేదాలు భిన్న వైఖరులు చోటు చేసుకోవటం కద్దు. ప్రాజెక్టులలో బాధ్యతలు పంచుకుంటున్న సభ్యులందరూ దాదాపుగా తాము సూచించిన సలహాయే శ్రేష్టమైనదంటూ వాదించడం మొదలెడతారు. అది సహజం కూడా. అయితే ఈ వాదోపవాదాలతో అసలు పని మూలబడే ప్రమాదముంది. విలువైన సమయాన్ని వృధా చేసే ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ బృందంలో సభ్యురాలిగా మీరేం చేయవచ్చంటే...

జట్టులోని సభ్యులు మీకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మీరూ వారితో వాదనకు దిగవద్దు. కొలీగ్ చెప్పేది నింపాదిగా, పూర్తిగా వినండి. తర్వాత మీ అభిప్రాయాలు పూర్తిగా వివరించండి.

మరి కొందరు మాత్రం వాదులాటకు దిగకుండా, తాము సూచిస్తున్న ప్రతిపాదనలే కంపెనీని ముందుకు తీసుకెళతాయని నచ్చచెప్పటం ద్వారానే మిగతావారిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక రీతిలో తమ ప్రతిపాదనలు నెగ్గితే చాలని వీరి అభిమతం కావచ్చు. అలాంటప్పుడు కూడా మీరు బలహీనతకు గురికాకుండా, సహేతుకంగా పరిశీలించి వ్యవహరించాలి.

సంభాషణను అదేపనిగా సాగదీస్తే వచ్చే ఫలితం శూన్యమే కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో సంభాషణను పక్కకు మళ్లించి మీకు మీరుగా లోకాభిరామాయణం మాట్లాడండి. సాగతీత ఆగిపోతుంది.

అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వాదన తెగకపోతే అందరి అభిప్రాయాలను పకడ్బందీగా రాసి టీం లీడర్‌కు పంపించండి. దాదాపు అందరూ ఈ చర్యకు గ్యారంటీగా ఆమోదం తెలుపుతారు మరి.

వెబ్దునియా పై చదవండి