భర్తతో మనస్పర్థలు.. మనసంతా గజిబిజి.. ఆఫీసుల్లో ఆలోచన వద్దు

శనివారం, 11 ఆగస్టు 2018 (11:44 IST)
భర్తలో మనస్పర్థలు తలెత్తాయా? ఉదయం నుంచి అదే ఆలోచనతో ఆఫీసుకు బయల్దేరే ఉద్యోగినులు మీరైతే.. ఈ కథనం చదవాల్సిందే. భర్తతో వాగ్వివాదం తర్వాత అదే ఆలోచనలతో ఆఫీసుకు బయల్దేరి.. పనిమీద శ్రద్ధ చూపెట్టలేని వారి సంఖ్య పెరిగిపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. 


అన్నీ రంగాల్లో మహిళలు రాణించినా.. ఇంటాబయటా పనులతో సతమతమవుతూ ఒత్తిడికి లోనయ్యే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఒత్తిడిని జయించాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
అవేంటంటే..? వ్యక్తిగత సమస్యలు గురించి ఆఫీసులో ఉండగా ఆలోచించకూడదు. తర్వాత సమయం ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి మీరు ఆఫీసుకి బయలుదేరేముందు మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు వస్తే దాని గురించి ఆలోచించకుండా ఆఫీసుకి ఎలా వెళ్లాలో ఆలోచించండి. ఆ సమస్య పరిష్కారానికి తప్పకుండా సమయం కేటాయించండి. లేకుంటే.. కార్యాలయాల్లో పని మీద శ్రద్ధ పెట్టలేకపోతారు. మనసంతా గజిబిజిగా వుంటే.. ఆ ఆలోచనలు రానీయకుండా.. వేరే పనిపై దృష్టి పెట్టాలి.  
 
పనిలో నిగ్రహం కోల్పోకుండా వుండాలంటే.. పది అంకెలు లెక్కబెట్టి చూడండి. అవకాశం ఉన్నట్లయితే కాసేపు అలా బయటికివెళ్లి తిరిగి వస్తే మళ్లీ పని మీద దృష్టిపెట్టగలగుతారు. అలాగే మీ సమస్యలను ఎదుటివారికి స్పష్టంగా తెలియజేయటానికి ప్రయత్నించండి. దీంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అపార్థాలు, దుర్వినియోగాలు లేకుండా చేసే పనిని మనస్ఫూర్తిగా చేయండి. 
 
మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసే వాటిని గమనించండి. వాటిని అధిగమించి ప్రశాంతంగా మీ పనులు చేసుకోవడానికి ఆలోచనలు చేయాలి. ఈ రకంగా అవతలివారి చర్యలను కూడా గమనించవచ్చు. అలాగే ఆఫీసులో ఉండే సమస్యలను ఇంటికి మోసుకెళ్లకూడదు. వ్యక్తిగత విషయాలు వేరు.. ఆఫీసు విషయాలు వేరు అని గమనించండి. 
 
ఇంటికెళ్లేటప్పుడు ఆఫీసు సమస్యలను ఇంటి గడప వద్దే వదిలిపెట్టండి. అలాగే ఆఫీసులోని వచ్చేటప్పుడు వ్యక్తిగత విషయాలను వెలుపలే వదిలిపెట్టేయండి. ఇలా చేస్తే ఒత్తిడి, భావోద్వేగాలకు చోటుండదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు