శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా?

సోమవారం, 2 జులై 2018 (11:37 IST)
శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని చాలా మంది చెబుతుంటారు. అలా పెట్టుకున్నట్లయితే ఏదో అరిష్టం జరుగుతుందని అంటారు. కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన ఎలాంటి దోషం ఉండదు. అలంకరణ కోసం, సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు చేయనక్కర్లేదు. అయితే ఒక్కసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ శివలింగానికి పక్కన పెట్టకూడదు.
 
భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన తరువాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది. సృష్టి అంతా వ్యాపించి ఉన్న శక్తులను వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేదే ఈ శివలింగం. అంతటి శక్తివంతమైన శివలింగానికి నిత్యపూజ చేయడమే ధర్మం. అదేవిధంగా నర్మదా బాణలింగాల వంటివి ఇంట్లో ఉంచుకోవచ్చును.
 
నిత్య పూజకు లోపం రానీయకూడదు. ఎందుకంటే శివుని ఒక్కడికే నిత్య అభిషేకం చేయాలని పురాణాలలో చెప్పబడింది. అభిషేకాన్ని ''అభిషేక ప్రియ శివః'' అన్నారు. కనుక రోజూ శక్తి కొద్ది భక్తి లోపం లేకుండా అభిషేకం చేయాలి. అభిషేకం అంటే కచ్చితంగా మంత్రాలు చదవాలనే నియమం లేదు. శివ పంచాక్షరి చదువుతు అభిషేకం చేయవచ్చును. శ్రద్ధగా శివపూజ చేయగలిగిన వారు ఇంట్లో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చును.
 
ముందుగా దీపారాధన చేసుకోవాలి. కలశంలోని నీటిని గంగా గంగా అని అభిమంత్రించాలి. ఆ తరువాత ''శ్రీ గంగా సహిత ఉమా మహేశ్వరాభ్యాం నమః ధ్యానం సమర్పయామి'' అని అక్షింతలు వేయాలి. లింగాన్ని పళ్ళెంలో పెట్టుకున్న తరువాత స్నానం చేసి అభిషేకమయ్యాక స్వామిని శుభ్రంగా తుడిచి మందిరంలో పెట్టుకుంటే మంచిది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు