పెద్దల పోట్లాట: పసి హృదయాలపై చెరగని ముద్ర

కల్లాకపటమెరుగని హృదయాలు వారివి. తెలిసిందల్లా ఒకటే. నిజాలు మాట్లాడడం. నచ్చిన ఆట ఆడుకోవడం వారి పని. ఇందులో తేడా ఏమి ఉండదు. తల్లి ప్రేమలో, తండ్రి సంరక్షణలో వారు ఆ చిన్న ప్రపంచానికి యువ రాజల్లా బతికేస్తుంటారు.

అలాంటి పరిస్థితులలో అమ్మనాన్న మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే ఇంకేముంది... ఆ పసి హృదయాలు విలవిలాడిపోతాయి. చేరోచేయి పట్టుకుని నడిచే వారికి ఆ పరిస్థతి లేదంటే తమ బుల్లి ప్రపంచాన్నే కోల్పోయినంత బాధ. సాధారణంగా సంసారమన్నాక చిన్నచిన్న గొడవలు తప్పవు. అవి ఇలా వస్తాయి.... అలా వెళ్ళతాయి.

తరువాత కలసిపోయి కాపురం చేస్తుంటారు. పిల్లల ముందు అమ్మనాన్న వాదులాడుకుంటే వారి తీవ్రప్రభావం పడుతుంది. చిన్ని హృదయాలు అప్పటి పరిస్థితులను అర్థం చేసుకునే స్థితిలో ఉండవు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా వారు అర్థం చేసుకోలేరు.

అంతే కాదండోయ్... ఆ సంఘటనలు వారి మనోఫలకాలపై చెరగని ముద్రవేస్తాయి. తీవ్ర అభద్రత భావానికి లోనవుతారు. సమాజంలో పూర్తిగా భయాందోళనలతో గడుపుతారు. కాదంటే చాలా కఠినంగా తయారవుతారు.

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంతవరకు పిల్లల ఎదుట పోట్లాడుకోకుండా ఉండడం మంచిది. ఘర్షణ వాతావరణం వచ్చినా దానికి గల కారణాలను వారికి అవగతం కలిగించాలి.

వెబ్దునియా పై చదవండి