దేవ ప్రశ్నం: ఆరో నేలమాళిగను తెరిస్తే పెను ముప్పే!

బుధవారం, 10 ఆగస్టు 2011 (16:56 IST)
File
FILE
అపార సంపద వెలుగు చూసిన తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగల్లో ఉన్న ఆరో గదిని తెరిచే విషయంపై దైవ నిర్ణయాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన "దేవ ప్రశ్నం"లో సంచలనాత్మక సమాధానం లభించినట్టు సమాచారం. ఈ ఆలయంలోని ఆరో నేలమాళిగను తెరిస్తే దేశానికే పెను ముప్పు తప్పదని వెల్లడైనట్టు తెలుస్తోంది. దీంతో ఆరో నేలమాళిగను తెరిచే విషయంలో శ్రీపద్మనాభ స్వామి ఆలయ పూజారులు వెనుకంజ వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వినికిడి.

ఈ ఆలయంలో ఉన్న నేలమాళిగల్లో ఇప్పటి వరకు ఐదు గదులను తెరిచారు. ఇందులో లభించిన సంపద వేల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా పేర్కొంటున్నారు. అయితే, నాగ రక్షాబంధం ఉన్న ఆరో నేలమాళిగను తెరిచే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం.. ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేక పోయింది. ఈ గదిని తెరిచే విషయంలో ఆలయ పూజారులు, ప్రత్యేక కమిటీయే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఈ నేపథ్యంలో ఆరో గదిని తెరిచే విషయంపై దైవ నిర్ణయం తెలుసుకునేందుకు దేవ ప్రశ్నం నిర్వహించారు. ఇందుకోసం ఆలయ పూజారులతో పాటు కేరళకు చెందిన మలయాళ పూజారులు గత మూడు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల రెండో రోజున నిర్వహించిన దేవ ప్రశ్నంలో మూడు ప్రశ్నలకు సమాధానాలు కోరారు. ఈ మూడింటిలోనూ లోపాలు ఉన్నట్టు తేలింది.

ఇందులో మొదటి ప్రశ్నలో ఆలయంలోని మూల విరాట్టు విగ్రహంలో లోపం ఉన్నట్టు తేలింది. అలాగే, రెండో ప్రశ్నలో ఆలయ కోనేరులో కనుగొన్న వినాయక విగ్రహానికి ఎలాంటి పూజలు పునస్కారాలు లేకుండా పక్కన పడేసినట్టు గుర్తించారు. మూడో ప్రశ్నలో ఆలయ బొక్కసం వ్యవహారానికి సంబంధించిన సమాచారం బయటకు వెల్లడి కావడం దోషంగా తేలింది.

అంతేకాకుండా, ఆరో నేలమాళిగలో దైవశక్తి కలిగిన అనేక విగ్రహాలు ఉన్నాయని ఇవి బయటకు తెస్తే ఆలయానికి మాత్రమే కాకుండా దేశానికి పెనుముప్పు ఏర్పడుతుందని దేవ ప్రశ్నంలో తేలినట్టు సమాచారం. అయితే, దీనిపై ఆలయ పూజారులు మాత్రం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు.

వెబ్దునియా పై చదవండి