పద్మనాభుని కోనేటి సంపదను తాకితే ప్రళయం తప్పదా!?

FILE
ప్రపంచంలోనే అత్యధిక ధనిక ఆలయంగా వార్తల్లోకెక్కిన అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో రోజు రోజుకీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆరో నేలమాళిగను తెరిస్తే అరిష్టమని పండితులు తెలిపిన నేపథ్యంలో, కోనేటి సంపదను తాకితే ప్రళయం తప్పదని వార్తలు వస్తున్నాయి.

తిరువనంతపురం శ్రీ పద్మనాభ ఆలయం పుష్కరిణిలో వెలకట్టలేని సంపద ఉందని ప్రచారం జరుగుతోంది. ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరులో అంతులేని సంపద దాగి వుందని ప్రచారం జోరందుకుంది.

మైసూరు రాజా టిప్పు సుల్తాన్ బారి నుంచి, ఆ తర్వాత బ్రిటిష్ వారి నుంచి దేవాలయ నిధులను పరిరక్షించే ఉద్దేశంతో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్ కోర్ రాజులు కొంతభాగం నిధి నిక్షేపాలను కోనేటి అడుగున దాచి ఉంచారని వార్తలు వస్తున్నాయి.

ఇంకా ఆరో నేలమాళిగకు సముద్రానికి లింక్ ఉందని, ఆరో నేర మాళిగను తెరిస్తే అరిష్టంతో పాటు ప్రళయం కూడా సంభవించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇదే తరహాలో కోనేటిలోని నిధులపై చెయ్యేస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని, సముద్రం ముంచెత్తి సర్వనాశనం చేస్తుందని పలువురు భయాందోళనలకు గురవుతున్నారు.

ఆలయం, ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు అడుగుభాగంలో రహస్య మార్గాలున్నాయని, నిధులు దాచిన గదుల్లోకి అవి తెరుచుకున్నాయని ఒకవేళ ఆ గదులను తెరిస్తే.. సముద్ర నీరు ఆ మార్గాల ద్వారా చొచ్చుకువచ్చి, ముంచేస్తుందని వివిధ ఆసక్తి కర కథనాలు షికార్లు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. పద్మనాభుని ఆలయంలోని నేలమాళిగలలో బయటపడిన నిధులు ఆలయానికే చేరాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అనంతుని ఆలయంలో లభించిన సొత్తు ఆయనకే చేరుతుందని భక్తులు చెబుతున్నారు. ఆలయంలో లభించిన ఆస్తులు కనుక పద్మనాభుడైన ఆ దేవుడికే చెందాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం భక్తులు విష్ణు సహస్ర నామాలు, యాగాలు నిర్వహిస్తున్నారు.

అయితే, పద్మనాభ ఆలయ నిధులను జాగ్రత్తగా మతపరమైన, సామాజిక పరమైన అవసరాలకు ఉపయోగించాలని రాజకుటుంబానికి చెందిన మహేంద్రవర్మ కోరుకుంటున్నారని ఆయన తరపు న్యాయవాది కేకే వేణుదోపాల్ కోర్టుకు చెప్పారు. వాటిచో ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించడం సబబన్నారు. ఇంకా కేరళలో హిందూ మత పునరుజ్జీవం కోసం వాటిని ఉపయోగించాలని మరికొందరు కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి