హథీరాం బాబాజీ తిరుమలలో 500 సంవత్సరాల క్రితం నివసించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి హథీరాం బాబాజీతో పాచికలాడినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. బాబాజీ మొదట్లో శ్రీవారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకునేవారు. అయితే రోజూ ఊరికే ప్రసాదాలు ఇవ్వడం ఇష్టంలేని ఆలయ అధికారులు హథీరాంజీని కట్టెలు కొడితేనే ప్రసాదాలని షరతులు విధించారు.
హథీరాంజీ ఏనుగులాగా బలంగా ఉండేవారని పురాణాల్లో ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాల కోసం కట్టెలు తెచ్చి వాటిని గొడ్డళ్ళతో హథీరాంజీ ముక్కలు చేసేవారట. కొన్ని రోజుల తర్వాత బాబాజీకి బాధ అనిపించిందట. తన సమయంతా దీనికి కేటాయిస్తున్నానేంటి అనుకునేవారట హథీరాంజీ. తిండి సంగతి దేవుడెరుగు ముందు తపస్సు చేసుకుందామని నిర్ణయానికి వచ్చి శ్రీవారి ఆలయానికి దూరంగా పాపవినాశనం అడవుల్లోకి వచ్చేశారు.
అతి సమీపంలోని అటవీ ప్రాంతంలో హథీరాంజీ బాబాజీ తపస్సుకు కూర్చొన్నారు. ఆ సమయంలో ఆయనకు ఆకలి వేసింది. ఆకలిని తట్టుకోలేక ఎదురుగా ఉన్న చిన్న చెట్టు ఆకులను తీసుకుని ఆరగించాడు. ఆ ఆకులు తియ్యగా ఉండటంతో ఆవురావురమంటూ ఆ ఆకులన్నింటినీ ఆరగించాడు. పక్కనే ఉన్న తీర్థంలో నీళ్ళు తాగాడు. ఆకలి తగ్గాక బాబాజీకి భయమేసింది. ఆకుల వల్ల ఏమన్నా అవుతుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే ఏమీ కాలేదు.
ఆకులు తిన్న తర్వాత అన్నం మాట మర్చిపోయి ఆకులు మాత్రమే తినడం ప్రారంభించాడు. అలా తన తపస్సును పూర్తి చేశాడు. అలా 12యేళ్ళపాటు తపస్సు చేసి ఆ బద్ధాకును తింటూ వచ్చాడు. కొంతమంది ఈ ఆకులను రామభద్రం ఆకులు లేక రామపత్తి అని పిలుస్తుంటారు. గతంలో అన్ని చెట్లు ఉండగా బాబాజీ ఈ ఆకునే తినడం ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదంతా శ్రీవారి మహిమేనని పురాణాలు చెబుతున్నాయి.
ఈ బద్ధి చెట్టు శేషాచలం అడవుల్లో మాత్రమే విరివిగా పెరుగుతాయి. ఇంక ఎక్కడా కనిపించదు. పాపవినాశనం దగ్గరలో వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర హథీరాంజీ బాబాజీ సమాధి ఉంది. ఇక్కడే ఆయన తపస్సు చేశారు. అక్కడికి వెళ్ళిన భక్తులకు బద్ధాకును ఇస్తుంటారు. ఈ ఆకు తియ్యగా, పుల్లగా ఉంటుంది. దీన్ని ఎంతైనా తినొచ్చు. ఇది తింటే సంపూర్ణ ఆరోగ్యం పొందడం ఖాయమట.