ప్రతిరోజు ఇంటి ముందు దీపం పెట్టేముందు ఇలా చేయాలి...!

శుక్రవారం, 10 మార్చి 2017 (13:11 IST)
దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. 
 
దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది. ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. 

వెబ్దునియా పై చదవండి