సూర్యుని ఎందుకు ఆరాధించాలి..!

సోమవారం, 16 జనవరి 2017 (08:31 IST)
భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చు గానీ వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాసాలకూ సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అదుకే ఆయన ప్రత్యక్ష దైవం, లోక సాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికి, ఆరోగ్యానికి, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.
 
ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తిభావంతో, కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సూర్యుడే కనుక అందులో ఆశ్చర్యమేమీ లేదు. సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండవది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచకంగా మాఘశుద్థ సప్తమినాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాల్లో ముఖ్యమైనది. నిస్వార్థకర్మకు తిరుగులేని ఉదాహరణకు సూర్యభగవానుడు.
 
సర్వసమానత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసె మీద, రాజసౌథం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధి నిర్వహణలో కూడా సూర్యుడే అందరికీ ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళలో అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషుడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందనడానికి ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
 
సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్యకిరణాలు మన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి. సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటా్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోపలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. 
 
అలా తెలియకుండా చేసేదే మాయ, నేను ఎవరు? అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలోచనను, చూపును లోపలికి మరలించుకున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యుని కంటే వెయ్యిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞానవివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం. 

వెబ్దునియా పై చదవండి