తిరుమల శ్రీవారి సంపదలను కాపాడుతున్నది ఇద్దరే ఇద్దరు... ఎవరు వారు?

ఆదివారం, 24 జులై 2016 (11:43 IST)
తిరుమల. ప్రపంచంలోనే ప్రసిద్ధిచెందిన ఆలయాల్లో ఒకటి. ప్రతిరోజు కోట్ల రూపాయల్లో ఆదాయం. సంవత్సరానికి ఇక చెప్పనక్కరలేదు. అలాంటి శ్రీవారి సంపదలను ఇద్దరే ఇద్దరు కాపాడుతున్నారు. ఇది ఇప్పటిది కాదు...శ్రీవారి ఆలయం నిర్మించబడిన 5 వేల సంవత్సరాల క్రితం నుంచి వారే కాపాడుతున్నారు. అప్పుడెప్పుడో కాపాడి వదిలేయడం కాదు.. ఇప్పటికీ.. ఎప్పటికీ వారే కాపాడుతున్నారు... కాపాడుతుంటారు కూడా.. వారెవరెరో తెలుసుకోవాలని ఉంది కదూ.. అయితే ఇది చదవండి...
 
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రతిరోజు 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. అంటే నెలకు 75 నుంచి 90 కోట్లు, సంవత్సరానికి వెయ్యికోట్లకుపై మాటే. ఇంతటి ఆస్తిని కాపాడడమంటే అది చిన్న విషయం కాదు. అది కూడా వేల సంవత్సరాల నుంచి ఇద్దరే భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు. వారే మహద్వారం ఎదురుగా ఉన్న శంఖనిధి - పద్మనిధిలు. ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమేనండి.. మహద్వారానికి ఇరువైపులా విడుపుల్లో ద్వారపాలకుల వలె సుమారు రెండు అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి. వీరే శ్రీవేంకటేశ్వరస్వామివారి సంపదలను రక్షించే దేవతలు...! ఇందులో ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత, రెండు చేతుల్లోను రెండు శంఖాలు ధరించి ఉండటం గమనించండి.. ఈయన పేరు శంఖనిధి..
 
అలాగే కుడివైపున అంటే ఉత్తరదిక్కున ఉన్న రక్షక దేవత చేతుల్లో రెండు పద్మాలు ధరింపబడి ఉంటాయి. ఆయన పేరు పద్మనిధి. ఈ నిధి దేవతల పాదాల వద్ద ఆరంగుళాల పరిమాణం గల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించండి.. ఈ విగ్రహం విజయ నగర రాజైన అచ్చుత దేవరాయలది. బహుశా అచ్చుతరాయల ఈనిధి దేవతామూర్తులను ప్రతిష్టించి ఉండవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
 
ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ట వల్ల స్పష్టమవుతోంది. ఆలయం యొక్క మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణ, రెండవది విమాన ప్రదక్షిణం, మూడవది సంపంగి ప్రదక్షిణం. అందుకే పురాతన కాలంలో స్వామివారి ఆలయానికి వెళ్లేముందు శంఖనిధి - పద్మనిధిలకు నమస్కారం చేసి భక్తులు లోపలికి వెళ్లేవారట. అంతటి ప్రాముఖ్యత కలిగిన వారు వీరిద్దరు. ఇప్పటికీ శ్రీనివాసుని సంపదలను కాపాడుతూనే వస్తున్నారు... శ్రీ వెంకటరమణా.. గోవిందా.. గోవిందా...! 

వెబ్దునియా పై చదవండి