ఉదయం రామాయణం, మధ్యాహ్నం భారతం, రాత్రి భాగవతం చదివితే?
గురువారం, 1 సెప్టెంబరు 2016 (10:05 IST)
రామాయణంలో రాముడే ధర్మమూర్తి.. ఆయన రీతిని గుర్తించాలి. ఇక భారతంలో చూస్తే ఇహంలో ఏ పని ఎంత తెలివిగా చేయాలనే ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాలి. రామ-శ్రీకృష్ణుల జీవనానికి గల అర్థమేమిటో.. వారి అవతారానికి కారణం ఏమిటో గ్రహించారు. సద్గుణ సంపన్నతతో ధార్మికుడై రోజును ప్రారంభించి.. లౌక్యం, రాజనీతి కలిగి వ్యవహార విజయం సాధించాలని పండితులు అంటున్నారు.
ప్రతిరోజూ ఉదయం లేవగానే రామాయణం, మధ్యాహ్నం భోజనానంతరం భారతం, రాత్రి నిద్రించే మందు భాగవతం చదవాలని లేదా చదివించుకుని వినాలని పెద్దలు చెప్తుంటారు. దీనిని జీవితానికి అన్వయించుకుంటే చాలు జన్మ తరించిపోతుంది. ఈ మూడూ రోజుకి ఒక్క పేజీ చదివినా చాలు.. జన్మ సాఫల్యం అవుతుంది.
ఇకపోతే.. అష్టాదశ పురాణాలు రచించినా వ్యాస భగవానుడికి మనశ్శాంతి లభించలేదు. ఆధ్యాత్మికంగా అసంతృప్తితో ఉన్న ఆయనకు నారదుడు తరుణోపాయం సూచించాడు. ప్రశాంతతతో పాటు లోకోద్ధరణ చేసిన తృప్తి కలగాలంటే వ్యాసుడు భాగవత కథారచన చేయాలని నిర్ణయించాడు. అప్పటిదాకా దేవతలకే పరిమితమైన ఆ కథాసుధామృతాన్ని నారదుడు వ్యాసుడికి అందించాడు.
వ్యాసుడు దాన్ని తన కుమారుడైన శుక మహర్షికి విశదీకరించాడు. కాలక్రమంలో, పరీక్షిత్తు మహారాజు శాపవశాత్తు వారం రోజుల్లో మరణిస్తాడన్న విషయాన్ని శుకుడు తెలుసుకున్నాడు. అమృత తుల్యం, మోక్షప్రదాయకం, సకల నిగమాల సారంగా భావించే భాగవతాన్ని మహారాజు సమక్షంలో ఆయన ప్రవచించాడు. ఆ విధంగా మహా భాగవతం కథారూపంలో జనబాహుళ్యానికి చేరిందని పురాణాలు చెప్తున్నాయి.
సంస్కృతంలో ఉన్న భాగవత కథ అప్పట్లో కేవలం పండితులకు, విద్వాంసులకే చేరువైంది. ఆ తరవాత ఆ గాథను తెలుగులో మహాకావ్యంగా సామాన్యజనులకు అందజేసే భాగ్యం పోతనామాత్యుడికి కలిగింది. ''నేను పలికేది భాగవతం. నన్ను పలికించే విభుడు రామభద్రుడు. నేను పలికే భాగవతం భవహరం అవుతుందట. అందువల్ల ఆ గాథనే నేను రచిస్తాను. వేరే గాథ రచించడం దేనికి" అనుకున్నాడు పోతన.
తనకు ఆ శ్రీరామచంద్రుడే స్వప్నంలో సాక్షాత్కరించి వేదవ్యాస భాగవతాన్ని తెలుగులోకి అనువదించాలని ఆనతి ఇచ్చినట్లు- లోకానికి తెలియజెప్పాడు. ఫలితంగా భాగవతం సులభ శైలితో తెలుగులోకి అనువాదమైంది. భాగవతంలో దశమ స్కంధంలో ద్వాపర యుగావతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడి దివ్య గాథ ఉంది. తొంభై శాతం భక్తుల కథలే భాగవతమయ్యాయి.
ధ్రువ చరిత్ర, అంబరీషోపాఖ్యానం, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర మధురాతిమధురంగా భక్తజనులకు అందాయి. భాగవతం చదివితే బాగుపడతాం అనేది తెలుగునాట నానుడిగా మారింది. భాగవత శ్రవణం ద్వారా మోక్షమార్గాన్ని పొందవచ్చు. అందుకే, ఏడు రోజుల్లో మరణం తప్పదన్న శాపగ్రస్తుడు పరీక్షిత్తు తనకు ముక్తి ప్రసాదించే ఏకైక ఆధ్యాత్మిక మార్గం శ్రవణమేనని విశ్వసించాడు. శుక మహర్షిముఖంగా ఆ భాగవతాన్ని విని ఆయన ముక్తి సామ్రాజ్యం పొందగలిగాడు.