తిరుమల, తిరుపతిల్లో అనేక చోట్ల స్వామివారి పాదముద్రలు ఉన్నప్పటికీ అలిపిరి వద్ద ఉన్న పాదాలకు ప్రత్యేకత ఉంది. శ్రీవారు తన ఇష్టసఖి పద్మావతి అమ్మవారిని కలిసి తిరుగు ప్రయాణమై కొండమీదకు వెళుతున్న సమయంలో ఆయన పరమ పవిత్రమైన ఆ మెట్లపై చెప్పులు లేకుండా నడవాలనుకుంటాడు. అలా తాను కాలుమోపిన మొదటి మెట్టుపైన స్వామివారి పాద ముద్రలు ఏర్పడ్డాయి.
స్వయంగా ఏర్పడిన పాద ముద్రలుగా వీటిని భక్తులు భావిస్తుంటారు. అందుకే తిరుమలకు వెళ్ళే చాలామంది భక్తులు మెట్లపై వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలి స్వామివారి పాదాలకు నమస్కరించి తిరుమలకు కాలినడకన వెళుతూ ఉంటారు. అలిపిరి కేంద్రంగా ఒకవైపు పాదాల మండపాన్ని, మరోవైపు వరదరాజస్వామి ఆలయాన్ని నిర్మించారు.
ఆ స్వామివారి పాదాల గొప్పతనాన్ని ప్రజలందరూ తెలుసుకునే విధంగా ఆ వరాహస్వామి ఆలయం చుట్టూ స్వామివారి పాదాలను నెత్తిపైన పెట్టుకుని భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. అలా చేస్తే స్వామివారి కటాక్షం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. అలిమేలు మంగాపురంలో వెలసిన పద్మావతి అమ్మవారిని చూడడం కోసం స్వామివారు కొండదిగి ఈ అలిపిరి మార్గం ద్వారానే వచ్చేవారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మార్గం ద్వారా నడవడం వల్ల ఎక్కువ పుణ్యం పొందవచ్చునని భక్తులు చాలామంది అలిపిరి పాదాల మండపం నుంచే కొండపైకి నడిచి వెళుతూ ఉంటారు.