క్రీ.శ.1339లో జరిగిన స్వామివారి ఏకమూర్తి విగ్రహాన్ని బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల మాడవీధుల్లో ఊరేగించారట. అప్పుడు ఒక అపవిత్రమైన ఘటన చోటుచేసుకుందని పురాణాల్లో ఉన్నాయి. మాఢావీధుల్లో ఒక చిన్న నిప్పు కణికగా ప్రారంభమైన అగ్ని, జ్వాలగా మారి తిరుమల మాఢా వీధుల్లో ఒకమూల అగ్నిగుండంలా ప్రత్యక్షమైందట. ఆ తరువాత వేగంగా మంటలు విస్తరించాయట. భక్తులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మాఢావీధుల్లోని ఆస్తులను ధ్వంసం చేసేసిందట ఆ అగ్ని.
అప్పుడు అక్కడున్న రాజులు, భక్తులు, పూజారులు, సంగీతకారులు ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారట. అనూహ్య రీతిలో జరిగిన ఈ సంఘటనతో అందరూ ఆశ్చర్యపోయారట. బ్రహ్మోత్సవాల్లో జరగని రాని తప్పు (విధానపరమైన లోపాలు) ఏదో జరగడం వల్లనే శ్రీవారే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా చేసి ఉంటారని పండితులు నిర్ణయానికి వచ్చి అదే విషయాన్ని అందరికి చెప్పారట. ఇదంతా జరుగుతుండగానే ఒక్కసారిగా ఆలయం మహద్వారం ముందు ఒక భక్తుడు గట్టిగా అరుస్తూ కనిపించాడట.
భక్తులారా.. అంటూ గట్టిగా అరిచారట. దీంతో ఆ భక్తుడిని చూసిన రాజులు, పండితులు మోకాళ్ళుపై కూర్చుని ఆ భక్తుడికి నమస్కారం పెట్టడం ప్రారంభించారట. బ్రహ్మోత్సవాలలో నా ఏకమూర్తి విగ్రహాన్ని ఊరేగించడం మంచిది కాదు. పవిత్ర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో నా దేవేరులు లేకుండా ఎలా ఊరేగిస్తారు. ఇవన్నీ మీకు తెలియదా.. ఇలా చేయడం ఇప్పటికైనా మానేయండి. నా విగ్రహంతో పాటు ఏకమూర్తి విగ్రహాన్ని ఆలయంలో ఉంచాలని చెప్పారట. అంజనాద్రి పర్వతం వెనుక మూడు విగ్రహాలు ఉంటాయి. వాటిని తీసుకొచ్చి ఉత్సవాలు చేయండని భక్తుడిలోని స్వామివారు చెప్పారట. ఆ సందేశం వినే లోపే అస్సలు విషయం అర్థమైందట భక్తులకు. ఆ భక్తుడిలో ప్రవేశించింది సాక్షాత్తు తిరుమల వెంకన్నే అని భావించి ప్రణమిల్లారట. అంతటితో భక్తుడి నుంచి స్వామివారు నిష్క్రమించాడు.
భక్తుని నుంచి స్వామి వెళ్ళగానే అప్పటివరకు విధ్వంసం సృష్టించిన అగ్నిగోళం తనంతట తానుగా అదృశ్యమై పోయిందట. దీంతో భక్తులు గోవిందా.. గోవిందా అంటూ గోవింద నామస్మరణలు చేశారట. ఆ తరువాత పండితులు అంజనాద్రి వెనుకకు వెళ్ళి గాలించగా ఒక రాతి మాటున వెంకటేశ్వరస్వామి ఆయన దేవేరులు శ్రీదేవి, భూదేవి విగ్రహాలు లభించాయట. వాటిని కళ్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం వంటి సేవలకు ఉపయోగిస్తూ వచ్చారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విగ్రహాలనే ఆయా ఉత్సవాలకు ఉపయోగిస్తున్నారట. ఏకమూర్తి విగ్రహాన్ని ఆలయంలో స్వామి పక్కనే పెట్టారట. అందుకే బ్రహ్మోత్సవాలను నిర్వహించే సమయంలో ఆలయ పండితులు ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తుంటారు.