అశోకవనంలో మహా తేజస్సుతో వెలుగుతూన్న స్త్రీమూర్తి... అప్పుడు హనుమంతుడు...

గురువారం, 13 జూన్ 2019 (20:38 IST)
లంకను చేరిన హనుమంతుడు తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకొని లంకానగరంలోని కట్టాడాలు, వనాలు చూస్తూ కోటలోకి ప్రవేశించబోగా లంకిణి అడ్డుకొని గుండెలపై చరిచింది. హనుమంతుడు కోపంతో ఎడమ పిడికిలితో ఆమెను కొట్టాడు. ఆమె కిందపడి "మహావీరా! ఒక వానరం నన్ను జయించిన రోజున లంకావైభవం నశిస్తుందన్ని బ్రహ్మ నాకు చెప్పాడు. దానవులకు ఆయువు మూడింది. నీవు స్వేఛ్చగా వెళ్ళు" అన్నది. లంకా వైభవాన్ని కనులారా తిలకిస్తూ ఆశ్చర్యపోతూన్న హనుమంతుడు రావణ కుంభకర్ణులను సౌందర్యవంతమైన స్త్రీలను రాక్షసులను చూసాడు. అతనికి సీత ఎక్కడా కనపడలేదు. 
 
అర్ధరాత్రి పండువెన్నల కురుస్తుండగా కోట బయటకు వచ్చిన హనుమంతుడికి అశోకవనంలో మహా తేజస్సుతో వెలుగుతూన్న స్త్రీమూర్తి కనిపించింది. పోలికలను బట్టి , ఆమె చీరను చూసి, ఆమె సీతాసాధ్వి అని నిర్దారించుకొన్నాడు. రాక్షస స్త్రీల కాపలాలో ఆమె విషన్నవదనియై ఉండడం చూసి విచారించాడు. ఇంతలో తెల్లవారింది. రావణుడు సీత దగ్గరకు వచ్చి రకరకాలుగా ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిచాడు. ఆమె తిరస్కరించింది. అప్పుడు రావణుడు" రెండు నెలల సమయంలో నీవు మనసుమార్చుకో. లేదా నిన్ను చంపి ఫలహారంగా వండిస్తాను" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. 
 
కొంతసేపటికి అంతా సద్దుమణిగాక హనుమ రామ సంకీర్తనం మొదలుపెట్టాడు. సీత లంకలో రామామృతం విని ఆశ్చర్యపోయింది. హనుమంతుడు రావణుడు పంపిన వాడేమో అనుకొన్నది. హనుమంతుని రమ్మని రకరకాల ప్రశ్నలు వేసింది. హనుమంతుడు చెప్పిన జవాబులు విని తృప్తిపడ్డాక అంగుళీకాన్ని ఇస్తాడు హనుమంతుడు. తాను కామరూపినని అనుమతిస్తే ముమ్ము భుజాన మోసుకొని లంకను దాటించగలనని చెప్పి తన మహారూపాన్ని చూపిస్తాడు. సీత సంతోషించి నాయనా ! నాభర్త వచ్చి రావణుడిని సంహరించి నన్ను తీసుకువెళ్ళడం యుక్తం. ఆయనకొరకు ఎదురుచూస్తున్నాని చెప్పు" అంటూ చూడామణి గుర్తుగా ఇచ్చి రాముడికి తనకూ మాత్రమే తెలిసిన సంగతులు చెప్పి పంపింది.
 
లంకలో ఎలాంటి శక్తువంతులున్నారో తెలుసుకొంటే రేపు రామ రావణ యుధ్ధంలో ఉపయోగంగా ఉంటుందని భావించి అక్కడ ఉద్యానవనాలు ధ్వంసం చేయ ప్రారంభించాడు. అది చూసి రాక్షస స్త్రీలు రావణుడికి తెలుపగా రావణుడు తనతో బలసమానులైన కింకర గణాన్ని పంపాడు. వారిని గెద్ద పాములను సంహరించినట్టు హనుమంతుడు నిర్జించాడు. తనతో పోరాటానికి వచ్చిన జంబుమాలిని, ఏడుగురు మంత్రిపుత్రులు, విరూపాక్షుడు, యూపాక్షుడు మొదలైనవారు యుధ్ధానికి రాగా వారిని స్వర్గానికి పంపాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి వివశుడు కాగా బంధించి రావణుని యొద్దకు తీసుకెళ్ళారు రాక్షస వీరులు. 
 
హనుమంతుడు తాను రామదూతనని సీతను రామునికి అప్పగించకుంటే చావు తప్పదని హెచ్చరిస్తాడు. రావణుడు హనుమంతుని వధించమనగా దూతను చంపరాదని మరేదైనా శిక్ష విధించవచ్చని విభీషణుడు అన్నాడు. రావణుడు కోతులకు తోక ఎంతో ప్రీతి కనుక ఆ తోకకు నిప్పంటించమనగా వారా పని చేశారు. మండుతున్న తోకతో లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి సీతకు తిరిగి కనిపించి నమస్కరించి వానరులతో కూడి రాముడిని చేరి" చూసాను సీతను అని చెప్పాడు.
 
రామ రావణ యుధ్ధం
రాముడు వానరులతో కడలిపై సేతువు నిర్మించి చేసిన రామ రావణ యుద్ధంలో హనుమంతుడు గొప్ప పాత్ర పోషించాడు. లక్షల మంది దానవులను సంహరించడమేగాక లక్ష్మణుడు మూర్చపోగా రాత్రికిరాత్రై ఔషధీ పర్వతం తెచ్చి రక్షించాడు. రావణుడి మరణం తరువాత అయోధ్యకు వెళ్ళి భరతునికి రాముని రాక ఎరిగించి స్వాగత కార్యక్రమాలు నిర్వహింప చేయించింది హనుమంతుడే! శ్రీ రామ పట్టాభిషేక వేళ సీతమ్మ అమూల్యమైన రత్నహారాన్ని ఇవ్వడమే గాక రాముడు తన సోదరులకు కూడా చూపని ప్రేమ చూపి చిరంజీవిత్వాన్ని, రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా ప్రసాదించాడు. హనుమంతుని జీవనం మనకందరకూ ఆదర్శవంతమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు