భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నప్పటికీ అరటికాయ, కొబ్బరికాయలకే ప్రాధాన్యం. ఎందుకంటే వాటికి పూర్ణఫలాలు అని పేరుంది. దీనికి కారణం వుంది. సృష్టిలో అన్ని ఫలాలను మనం ఆరగించి, వాటిలోని విత్తనాలను నోటి నుంచి ఊసేస్తాం. దానివల్ల ఆ విత్తనాలు ఎంగిలిపడుతాయి. కొన్ని పండ్లను పక్షులు తిని, వాటి విత్తనాలను విసర్జిస్తాయి. అవి మొలకెత్తి, తిరిగి పుష్పించి, ఫలిస్తాయి. మనం తిరిగి ఆ ఫలాలనే భగవంతునికి సమర్పిస్తాం. అది అంత శ్రేష్టం కాదు.
ఐతే అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరుగదు. మహాపతివ్రత అత్యంత సౌందర్యరాశి అయిన సావిత్రిదేవి శాపవశాత్తూ భూలోకంలో అరటిచెట్టుగా జన్మించింది. అరటి చెట్టు విత్తనాల ద్వారా కాకుండా పిలకల ద్వారా మొలిచి పండ్లను ఇస్తుంది. కొబ్బరి చెట్టు విత్తనం కలిగిన చెట్టే అయినప్పటికీ దానికి ఎంగిలి దోషం అంటదు. అందుకే అరటి పండు, కొబ్బరికాయలు పూర్ణఫలాలయ్యాయి. విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. అందువల్ల ఈ దేవుళ్లను కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.