గుడికి వెళ్ళిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా భగవంతుని విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. ప్రదక్షిణలు అయితే చేస్తాం కానీ, ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగా తెలీదు. దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబు కొందరు ఆధ్యాత్మిక పండితులు ఇలా చెబుతున్నారు.
మనకి కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తిని పొందుతోంది.
ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, భగవంతుని విగ్రహం చుట్టూ తిరగటం... పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచీ ఇలా ప్రదక్షిణ చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.