దేవుని త్రాసులో హెచ్చుగా తూగుదాం....

శనివారం, 25 ఫిబ్రవరి 2012 (09:33 IST)
విశ్వమంతటకీ మకుటంగా, ఏలికగా దేవుడు మనిషిని సృష్టిస్తే, అతడు క్రమేణా దిగజారి తనలోని అనైతికతకు బానిసగా మారాడు. దేవుని సంకల్పాలను కాదని స్వార్ధానికి పెద్దపీట వేసి జీవిత పరమార్థాన్ని మర్చిపోయాడు. తాను దిగజారాడు, తన చుట్టూ ఉన్న సమాజాన్నీ దిగజార్చాడు.

క్రీస్తూ పూర్వం ఆరవ శతాబ్ధంలో బబులోను మహా సామ్రాజ్యానికి దేవుడు బెల్షస్సరును చక్రవర్తిని చేస్తే, ఆ దేవున్ని, తన విధులనూ మర్చిపోయి విందు. వినోదాల్లో అతను మునిగితేలతాడు. ఒకానొక దశలో కళ్ళు నెత్తికెక్కి, యెరూషలేములో పవిత్ర దేవాలయపు గర్భగుడిలో దేవుని పరిచర్యకు మాత్రమే వాడదగిన బంగారు, వెండి ఉపకరణాలను తన రాజభవనానికి తెప్పించుకుని వాటిలో తాను, తన పరివారం 'తిని తాగటం' ఆరంభించారు. దేవున్ని వదిలేసిన వ్యక్తి, దేవుడు వదిలేసిన వ్యక్తి ఎంతటి స్థితికి దిగజారతాడో చెప్పడానికి బెల్షస్సరే తార్కాణం.

అతని ఆగడాలు మితిమీరిపోగా ఒకరోజు దేవుని అదృశ్య హస్తం దైవభాషలో అతని గురించి గోడ మీద 'మెనేమెనే టెకేల్ ఉషార్సీన్' అని రాసింది. దైవాత్మపూర్ణుడైన దానియేలు అనే యూదుడు ఆ మాటకు అర్థం 'దేవుడు నీ లెక్క ముగించాడు. నిన్ను తన త్రాసులో తూచగా నీవు చాలా తక్కువుగా తూగావు. కాబట్టి నీ రాజ్యం నీ నుండి తొలగించబడుతుంది' అని వివరించాడు. ఆ మాట ప్రకారం ఆ రాత్రే బెల్షస్సరు హతమైయ్యాడు. (దానియేలు 5:1-31)

కాల గర్భంలో మరో ఏడాది గడచిపోయి, కొత్త ఏడాది అంకురించిన ఆ శుభఘడియల్లో దేవుడు తన త్రాసులో తూస్తే మనం ఎంత తూగుతామన్న ప్రశ్న మనమంత వేసుకోవడం మంచిది. లోకం త్రాసులో ఎంత తూగుతామన్న ప్రశ్నే కాదు. ఎందుకంటే లోకం త్రాసు వేరు, తూనికరాళ్ళు వేరు. లోకంలో శభాష్ అనిపించుకోవడం, చపట్లు కొట్టించుకోవడం వేరు. దేవుని మెప్పు పొందడం వేరు.

వెబ్దునియా పై చదవండి