మహిళల 'శబరిమల' ఆట్టుకల్ భగవతీ ఆలయం

WD PhotoWD
ఈ వారం తీర్ధయాత్రలో దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కేరళ, తిరువనంతపురంలో గల అట్టుకల్ భగవతీ దేవాలయానికి మిమ్మల్ని తీసుకు వెళ్తున్నాము. అట్టుకల్ భగవతి దేవాలయం 'మహిళల శబరిమల'గా పేరు పొందింది. ఈ దేవాలయానికి వచ్చే భక్తుల్లో అత్యధికులు మహిళలు కావడంతో ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చింది.

తిరువనంతపురంలో కీలకప్రాంతమైన ఎమ్.జీ. రోడ్డుకు కొద్ది కిలోమీటర్ల దూరంలోని అట్టుకల్ దేవాలయం చాలా సంవత్సరాల క్రితం నిర్మితమైంది. ఈ దేవాలయానికి చెందిన పొన్‌కాల ఉత్సవం, అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొనే ఉత్సవంగా గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డుల్లో నమోదైంది.

తమిళ రచన 'శిలాపతికారం'లో కథానాయిక కన్నగి అవతారమే అట్టుకల్ భగవతిగా భక్తులు విశ్వసిస్తుంటారు. మదురై పట్టణాన్ని నాశనం చేసిన అనంతరం కన్నగి కేరళకు ప్రయాణించి అట్టుకల్‌లో కొంత సేపు విశ్రమించారని నమ్మిక. ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో విశ్రమించిన కన్నగికి నివేదించే నిమిత్తం స్థానిక మహిళలు
WD PhotoWD
'పొన్‌కాల'ను తయారు చేస్తారు.

ప్రతి సంవత్సరం అట్టుకల్ భగవతి దేవాలయంలో పొన్‌కాల ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. మళయాళ సంప్రదాయాన్ని అనుసరించి కుంభ మాసంలో పూర్వభద రోజున పొన్‌కాల ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన పొన్‌కాల ఉత్సవం ఘనంగా జరిగింది.

పొన్‌కాల అనగా ఉడకించిన పదార్థాన్ని దేవతకు నైవేద్యంగా పెట్టడం అని అర్థం. బియ్యం, బెల్లం, కొబ్బరి, పప్పు ధాన్యాలను కలిపి పొన్‌కాలను తయారు చేస్తారు. కేరళలోని దక్షిణ ప్రాంతం మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో దేవునికి పొన్‌కాలను నైవేద్యంగా పెట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

WD PhotoWD
మళయాళ మాసమైన మకరం-కుంభం (ఫిబ్రవరి-మార్చి) లో కార్తీక నక్షత్రాన పదిరోజుల పొన్‌కాల ఉత్సవం ప్రారంభమవుతుంది. రాత్రి సమయాన 'కురుతితర్పణం' పేరిట త్యాగపూరిత నివేదనతో ఉత్సవం ముగుస్తుంది. 'తోటమ్‌పట్ట్' పేరిట భగవతి పాటలను ఉత్సవం జరిగినంత కాలం భక్తులు ఆలపిస్తారు.

'కుతియోట్టం వ్రతం' అనే పూజకార్యక్రమాన్ని నూనూగు మీసాల పిల్లలు చేస్తారు. వారు దేవాలయంలోనే కొద్ది రోజులు బస చేసి దేవతకు 1008 నమస్కారాలు సమర్పించుకుంటారు. ఉత్సవం తొమ్మిదవ రోజున ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అట్టుకల్ పొన్‌కాల మహోత్సవం జరుగుతుంది. దేవాలయం చుట్టూ ఆవరించి ఉన్న దాదాపు ఐదు కి.మీ.ల వ్యాసార్థంలో కేరళతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది సంఖ్యలో మహిళా భక్తులు పొన్‌కాల కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు.

చేరుకునే మార్గం:
సమీప రైల్వే స్టేషన్: దేవాలయానికి రెండు కి.మీ.ల దూరంలో గల తిరువనంతపురం రైల్వే స్టేషన్
సమీప విమానాశ్రయం: దేవాలయానికి ఏడు కి.మీ.ల దూరంలో గల తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం.