ఆంధ్రరాష్ట్రంలోని పంచారామాల్లో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరుని ఈసారి తీర్థయాత్రలో దర్శిద్దాం. పెన్నానది ఉపనది స్వర్ణముఖి నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం దక్షిణభారత పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధిగాంచినది. పవిత్ర స్వర్ణముఖి నది ఒడ్డును ఆనుకుని కొండల నడుమన కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి దక్షిణ కాశి అనే పేరుకూడా ఉంది.
ఆలయంలో కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలు. వీటిలో ఎత్తైన గాలి గోపురం విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. అత్యంత పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైన మరియు పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము శ్రీకాళహస్తి. దేవాలయంలోని రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది.
WD
శ్రీ.. అంటే సాలెపురుగు, కాళ... అంటే పాము, హస్తి... అంటే ఏనుగు... ఇవి ఆ సర్వేశ్వరుని పూజించి మోక్షము నొందాయని అందువల్లనే ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా ప్రసిద్ధిగాంచిందని చెప్పబడింది. పురాణ గాధను అనుసరించి ఆలయంలో కొలువున్న శివలింగం చుట్టూ సాలెపురుగు గూడుకట్టి ఆ స్వామివారిని పూజిస్తే... పాము ఓ మణిని శివలింగంపై ఉంచి ప్రార్థించేదనీ... అదేవిధంగా ఏనుగు పవిత్రజలంతో శివలింగాన్ని కడిగి అర్చించేదనీ తెలుపబడింది. దీనిని సూచిస్తూ దేవాలయంలో ఓ విగ్రహం మనకు కనబడుతుంది.
WD
స్కంద పురాణం, శివపురాణం, లింగపురాణాల్లో శ్రీకాళహస్తి గురించి చెప్పబడి ఉంది. కాళహస్తీశ్వరుని పూజించి, కొండపై ఉన్న భరద్వాజుని అర్జునుడు కలిశాడని స్కందపురాణంలో ఉంది. అంతేకాదు కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడనీ, అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి రక్తం కార్చగా, వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడనీ, దీంతో పరమేశ్వరుని రెండవకంటి నుండి కూడ రక్తం కారటం మొదలయింది. శివ భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్నును కూడా పీకి స్వామి రెండో కంటికి అమర్చాడు. కన్నప్ప భక్తికి ప్రసన్నడునైన స్వామి ప్రత్యక్షమై అతనిని కరుణించి ముక్తి ప్రాసాదించాడు.
ఈ దేవాలయంలో రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. అంతేకాదు రుద్రాభిషేకం, పాలాభిషేకం...మొదలైన పూజలు కూడా జరుగుతాయి. దక్షిణకైలాసమనే పేరుతోపాటు సత్య మహా భాస్కరక్షేత్రమనీ , సద్యోముక్తిక్షేత్రమనీ, శివానందైక నిలయమనీ పిలుస్తారు. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.
WD
చూడదగిన ఇతర సమీప దేవాలయాలు విశ్వనాధ ఆలయం, కొండపై ఉన్న కన్నప్ప ఆలయం, మణికర్నిక ఆలయం, సూర్యనారాయణుని ఆలయం, భరద్వాజ తీర్థం, కృష్ణదేవరాయ మంటపం, వేయిలింగాల కోన, కొండపై ఉన్న దుర్గాంబ ఆలయం, సుబ్రహ్మణ్య ఆలయం, దక్షిణ కాళి ఆలయం
ఎలా చేరుకోవటం... ఈ పుణ్యక్షేత్రానికి అతి సమీపానగల విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం( 20 కిమీ). తిరుపతి నుంచి కాళహస్తి ప్రయాణం ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది. ఇంకా చెన్నై, గూడూరు, మద్రాసు, విజయవాడ వంటి ప్రధాన నగరాలనుంచి రైలు సౌకర్యం ఉన్నది. అదేవిధంగా స్థానికంగా టాక్సీలు, ఆటోలు, సిటీ బస్సులు రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి లేదా చంద్రగిరి- తిరుపతి- అలిపిరి- రేణిగుంట, శ్రీకాళహస్తికి నడుస్తాయి.
ఎక్కడ బస చేయాలి... శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునేవారు చిత్తూరు, తిరుపతిల్లో బసచేయవచ్చు. ఇక్కడ సామాన్య ప్రజలకు అందుబాటులో గల హోటళ్లు చాలా ఉన్నాయి.