సర్వదర్శనానికీ స్లాట్ విధానం ప్రవేశపెట్టి భక్తులకు 2 గంటలకు మించకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 10, 12 తేదీలలో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం అమలుకు తితిదే అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిత్యం 22 వేల నుంచి 38 వేల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందుకోసం తిరుమలలో 21 ప్రాంతాలలో 150 కౌంటర్లు ద్వారా టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేపట్టారు. టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డును తితిదే అధికారులు తప్పనిసరి చేశారు. ఒక్కసారి టోకెన్ పొందిన భక్తుడికి మరో 48 గంటల వరకు టోకెన్ పొందే అవకాశం ఉండదు. ఫిబ్రవరి నుంచి కొత్త విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.