మార్చి తర్వాత తొలిసారి శ్రీవారి హుండీ ఆదాయం రూ.2 కోట్లు!

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (09:24 IST)
కరోనా లాక్డౌన్ తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో మార్చి నెల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం తొలిసారి ఏకంగా రూ.2.34 కోట్ల మేరకు వచ్చిందినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా, కేంద్రం మార్చి మూడో వారంలో లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత, భక్తుల దర్శనాలకు అనుమతించిన టీటీడీ, ఆపై నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనాలు ప్రారంభించింది. ఆపై తొలిదశలో 3 వేల మందికిలోపే దర్శనాలు చేయించారు.
 
ఈ సమయంలో హుండీ ఆదాయం భారీగా పడిపోయి, రూ.50 లక్షల దిగువకు చేరింది. లాక్డౌన్‌కు ముందు రోజు వరకు రూ.3 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక భక్తుల సంఖ్యను అధికారులు క్రమంగా పెంచుతూ వచ్చారు.
 
ఈ నేపథ్యంలో ఆదివారం నాటి హుండీ ఆదాయం, లాక్డౌన్ తర్వాత రూ.2 కోట్లను దాటింది. ఆదివారం 2.34 కోట్ల హుండీ ఆదాయం లభించిందని, 12 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు