ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అలిపిరి వద్ద, తిరుమలలోనూ టీటీడీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో యాత్రికులకు కూడా కరోనా టెస్టులు చేపట్టామని తెలిపారు. అయితే భక్తులెవరికీ కరోనా సోకలేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారిలో 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని చెప్పారు.
కాగా, టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్టు సింఘాల్ తెలిపారు. తద్వారా వివాదాలకు తావు ఉండదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టెండర్లు పిలుస్తున్నామని, అయితే అప్పటి పరిస్థితుల ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు.
తాజాగా ఏపీలో కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు కరోనాతో ప్రాణాలు విడిచారు. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 328కి పెరిగింది.
ఇక, కొత్తగా 1,933 మందికి కరోనా కేసులు గుర్తించారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 268, కర్నూలు జిల్లాలో 237, కృష్ణా జిల్లాలో 206 మందికి కరోనా సోకినట్టు తేలింది.
నేటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. తాజాగా 846 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,412కి చేరింది. ఇంకా 13,428 మంది చికిత్స పొందుతున్నారు.