తిరుపతి నగరంలో గంగమ్మ జాతర శోభ

మంగళవారం, 10 మే 2016 (10:38 IST)
రాయలసీమలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి జాతర శోభను సంతరించుకుంది. కలియుగ వైకుంఠుడు శ్రీనివాసునికి స్వయానా చెల్లెలైన గంగమ్మ జాతరంటే రాయలసీమ జిల్లా ప్రజలకు పండగే. జాతర అర్థరాత్రి చాటింపుతో ప్రారంభం కానుండడంతో ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దేవస్థానం అధికారులు. మంగళవారం ఉదయం నుంచే భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు చేస్తున్నారు. 
 
తాతాచార్యులనబడే వైష్ణవ ఉపాసకునికి చెందిన చెరువు ఒడ్డున గంగమ్మను తాతాచార్యులు ప్రతిష్ట చేశారు. ఆయనకు చెందిన భూమిలో ప్రతిష్ట చేయడంతో అమ్మవారు తాతయ్యగుంట గంగమ్మగా ప్రసిద్ధి చెందారు. అమ్మవారి జన్మస్థలం తిరుపతి రూరల్‌లోని అవిలాల గ్రామం. జాతర ప్రారంభమయ్యే మొదటిరోజున పుట్టింటి సారెను అవిలాల గ్రామ పెద్దల నుంచి ఆలయ నిర్వాహకులు వూరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు. 
 
ఆ విధంగా సంప్రదాయబద్ధంగా పుట్టింటి సారెను అందుకున్న మరుక్షణం నగర పొలిమేరల్లో చాటింపు వేస్తారు. అలా మొదలు నగరం నుంచి స్థానికులైన వారు పొలిమేర్లు దాటకూడదని విశ్వాసం. జాతర జరిగే రోజులన్నింటిలోను వీధులలో అంబలి వితరణ, పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 
 
అర్థరాత్రి నుంచి చాటింపు కాగానే ఇక వేషాలే వేషాలు.. భక్తులు వివిధ రకాల వేషధారణలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. బుధవారం ఉదయం బైరాగివేషంతో ప్రారంభమై సున్నపుకుండలు వరకు వేషధారణలు కొనసాగుతుంది. 18వ తేదీ విశ్వరూప దర్శనంతో జాతర పరిసమాప్తమవుతుంది.

వెబ్దునియా పై చదవండి