సాధారణంగా మనుషులు చనిపోతే స్వర్గానికి, నరికానికో వెళతారనే ప్రచారం ఉంది. కొంతమందైతే నేను ఖచ్చితంగా నరకానికే.. నిన్ను సలసలా కాగే నూనెలో వేసి వేయిస్తారు.. లేదా కొరడాలతో కొడతారు... ఇలా ఏదోదో చెబుతుంటారు.. కానీ అలాంటి నరకానికి వెళ్ళకూడదనుకునే వారు ఇలా చేస్తే వెళ్ళరని పురాణాలు చెబుతున్నాయి.
తిరుమల స్వామివారి పుష్కరిణిలో స్నానం చేస్తే పవిత్రత చేకూరుతుందట. ఎవరైతే స్వామివారి పుష్కరిణిని కీర్తిస్తూ, స్తుతిస్తూ, పరమభక్తి ప్రపత్తులతో అందులో స్నానం చేస్తారో వారికి తామిశ్రం, మహారౌరవం. కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రతవనం. ఆదిగా ఉన్న ఇరవై ఎనిమిది విధానాలై మహానరకాలు తొలగుతాయి. ఈ మహానరకాలన్నీ ఊహించలేని, వర్ణించలేని, చెప్పలేని మహాపాపాలు చేయడం వల్ల కలుగుతాయి. అలాంటి మహాపాపాలన్నీ ఒక్క స్వామి పుష్కరిణి తీర్థస్నానం మాత్రం చేతనే నశిస్తాయి. అందువల్ల ఇలాంటి పవిత్రమైన స్వామి పుష్కరిణిని భక్తితో కీర్తించాలి.
ఆ పావన జలాల్లో అత్యంత విశ్వాసంతో, భక్తి ప్రపత్తులతో స్నానం ఆచరించాలి. సేవించాలి. పరమ పుణ్యప్రదమైన స్వామి పుష్కరిణిని ఏ మాత్రం అగౌరవించకూడదు. స్వామి పుష్కరిణి మహత్మ్యాన్ని గూర్చి ఎంత మాత్రం సందేహించకూడదు. అంతేకాదు పరమభక్తి విశ్వాసాలతో ఉన్న వారికి కుశంకలను కలిగించకూడదు. ఆ విశ్వాసాలన్నీ భ్రమ, అసత్యం అని అంటూ ఎవరైతే ఇతరులకు కూడా విశ్వాసాన్ని పోగొడతారో, వాళ్ళు నికృష్టమైన పంది జన్మను పొంది వ్యర్థ జన్ములై ఉంటూ మహానరకాలకు పోతారట.
స్వామి పుష్కరిణి స్నానం నాస్తికుల వల్ల కలిగే భయాన్ని పోగొడుతుంది. ఆ తీర్థాన్ని సేవించినవారు ఆ తీర్థ జలాలలో స్నానం చేసిన వారు ఆ పుష్కరిణిని స్తుతించిన వారు, పొగడిన వారు, తాకినవారు లేదా నమస్కరించిన వారు.. ఇలాంటి వారందరూ మాతృగర్భంలో తిరిగి పుట్టనే పుట్టరట. స్తన్యం తాగనే తాగరు. అంటే పునర్జన్మ ఉండదట.