భక్తులు లేకుండానే శ్రీరామ నవమి వేడుకలు - షిర్డీ ఆలయం మూసివేత

మంగళవారం, 17 మార్చి 2020 (12:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి యేటా శ్రీరామ నవమి వేడుకలు కన్నులపండుగగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే, ఈ యేడాది శ్రీరామ నవమి వేడుకలపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. వచ్చే నెల రెండో తేదీన భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి వేడుకలను భక్తులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. 
 
ఈ వేడుకలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. భద్రాద్రి కల్యాణం కోసం ఆన్‌లైన్‌లో విక్రయించిన టికెట్లను రద్దు చేస్తున్నామని మంత్రి చెప్పారు. భక్తులకు టికెట్‌ డబ్బు తిరిగి ఆలయ అధికారులు చెల్లిస్తారని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేవలం ఆలయ ప్రాంగణంలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.
 
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు. అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అని మంత్రి పువ్వాడ అజయ్‌ చెప్పారు. 
 
షిర్డీ ఆలయం మూసివేత 
మరోవైపు, కరోనా వైరస్‌ ప్రభావంతో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆలయాన్ని ట్రస్ట్‌ అధికారులు మూసివేయనున్నారు. 
 
భక్తులు షిర్డీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని ఇప్పటికే మూసివేసిన విషయం తెల్సిందే. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా మూసేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఆలయంలో శ్రీవారిని టైంస్లాట్‌ టోకెన్‌ ద్వారా తక్కువ సమయంలో దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మూడుకు చేరిన కరోనా మృతులు 
మహారాష్ట్రలో కరోనా వైరస్‌తో 68 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు 36 నమోదు అయ్యాయి. ఇప్పటికే సీఎం ఉద్ధవ్‌ థాకరే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు