తిరుమలలో అన్యమత ప్రచారం.. విజిలెన్స్‌ అదుపులో అన్యమతస్థుడు

సోమవారం, 4 ఏప్రియల్ 2016 (16:50 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మరోసారి అన్యమత ప్రచారం జరిగింది. ఎస్‌ఎన్‌సి కాటేజీల వద్ద మతప్రార్థనలు చేస్తున్న వ్యక్తిని టిటిడి విజిలెన్స్, నిఘా సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. అన్యమతస్థుడి నుంచి ఒక బైబిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల ధార్మిక క్షేత్రంలో హిందూ మతానికి సంబంధించిన తప్ప మరే ఇతర మతాల వారు ప్రార్థనలు గానీ మతప్రచారం చేయకూడదన్న నిషేధం ఉంది.
 
అయినా సరే గత కొన్నినెలలగా అన్యమతప్రచారాన్ని కొందరు నిర్వహిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ సంఘటనపై టిటిడి ఉలిక్కిపడుతోంది. అన్యమతస్థుడు అసలు తిరుమలకు ఏ విధంగా ప్రవేశించాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలిబాట నుంచి వచ్చినా రోడ్డుమార్గం నుంచి వచ్చినా సిబ్బంది తనిఖీ చేసి పంపుతారు. 
 
అయితే వారిని దాటి ఆ పుస్తకాన్ని ఏ విధంగా అన్యమతస్థుడు తీసుకువచ్చారో పోలీసులకు అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఇప్పటికే తితిదే ఇఓ సాంబశివరావు పోలీసులను ఆదేశించారు. అన్యమతస్థుడిని మీడియాకు కనిపించకుండా పోలీసులు విచారిస్తున్నారు. అతని వివరాలను కూడా గోప్యంగా ఉంచుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి