ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. శుక్రవారం వేకువజాము నుంచే ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో భక్తులు క్యూకట్టారు. ముఖ్యంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు భద్రాద్రి, వేములవాడ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
తిరుమల శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వారాలు గత అర్థరాత్రి తెరుచుకోగా, తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి ప్రముఖులను దర్శనానికి ఆహ్వానించారు. ఇప్పటికే రెండున్నరవేల మందికిపైగా స్వామి వారిని దర్శించుకున్నట్టు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
నాలుగు గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇచ్చారు. వచ్చే నెల మూడో తేదీ వరకు స్వామి వారి ఉత్తర దర్శనం కల్పించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈ ఉదయం 6.43 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా సామివారు దర్శనమిచ్చారు. నిత్య కైంకర్యాలు, శుక్రవారం అభిషేకం నిర్వహించారు. అర్థరాత్రి తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారం తెరిచారు. వేకువజామున 3.30 గంటల నుంచి ప్రముఖుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
భద్రాద్రిలో...
భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై రామయ్య, గజ వాహనంపై సీతమ్మ, హనుమంత వాహనంపై లక్ష్మణుడు దర్శనమిచ్చారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుని సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 6.43 గంటల నుంచి యాదాద్రీశుడు ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నారు.
ధర్మపురిలో...
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నది. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహస్వాముల మూలవిరాట్లకు మహాక్షీరాభిషేకం నిర్వహించారు.
కరోనా దృష్ట్యా పురవీధుల్లో స్వామివారి ఊరేగింపును అధికారులు రద్దు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుడు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. రాజేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.