కోవిడ్ కారణంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగానే నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 11 నుంచి 19వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.
తిరుచానూరులోని ఆస్థాన మండపంలో బుధవారం జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాలు, భక్తుల ఆరోగ్య భద్రత, అమ్మవారి వాహన సేవలు, పంచమి తీర్థం నిర్వహణపై ఆగమ సలహాదారు, జీయ్యంగార్ల ప్రతినిధులు, అధికారులతో జెఈవో కూలంకషంగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జెఈవో శ్రీ బసంత్‌కుమార్ మాట్లాడుతూ, కోవిడ్ -19కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అక్టోబరు నెలాఖరు వరకు అమలు చేస్తున్న మార్గదర్శకాలను నవంబరు నెలాఖరు వరకు పొడిగించిందని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకుని అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆగమ శాస్త్రం, సంప్రదాయాలకు కట్టుబడి ఏకాంతంగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఉద్యాన, విద్యుత్ విభాగాల అధికారులు ఆలయం అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి వాహనసేవలను ఎస్వీబిసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన మరోసారి సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని జెఈవో తెలిపారు.