సన్నిధి గొల్ల వెంకట్రామయ్య పదవీకాలం యేడాది పొడిగింపు

శుక్రవారం, 1 జులై 2016 (11:24 IST)
తిరుమల శ్రీవారిని మొదటగా దర్శించుకునే సన్నిధి గొల్ల వెంకట్రామయ్య మొరను వెంకన్న ఆలకించినట్లున్నారు. గురువారంతో వెంకట్రామయ్య పదవి ముగియనుండటంతో మరో సంవత్సరంపాటు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. యాదవుల ఆందోళనలతో తితిదే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
తిరుమల ఆలయ తెరుపులు తెరిచే మొదటి వ్యక్తి ఆయనే. స్వామి దర్శనం కూడా మొదటగా ఆయనదే. ఆయన మరెవరో కాదు సన్నిధి గొల్ల వెంకట్రామయ్య. అలాంటి వ్యక్తి తిరుమలలో విధులు నిర్వహిస్తూ వస్తున్నాడు. తితిదే కూడా ఆయనకు గౌరవం ఇస్తూనే ఉంది. అయితే ఆయన పదవీ కాలం ఈనెల చివరికి ముగియనుండడంతో ముందుగానే తితిదే వెంకట్రామయ్యకు సమాచారం అందించింది. ఈనెల చివరికల్లా విధుల నుంచి విరమణ పొందాలని తెలిపింది. 
 
దీంతో వెంకట్రామయ్య యాదవులను ఆశ్రయించాడు. శ్రీవారినే నమ్ముకున్న తనను ఉన్నట్లుండి తితిదే పదవీ విరమణ చేయమంటోందని తెలపడంతో యాదవులందరు ఐక్యమయ్యారు. తితిదేపై ఉద్యమాన్ని లేవనెత్తారు. అంతటితో ఆగలేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. యాదవుల ఆందోళనతో తితిదే ఈఓ చల్లబడ్డారు. ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. 
 
సన్నిధి గొల్ల వెంకట్రామయ్యను కొనసాగించాలని ఆ లేఖలో కోరారు. లేఖకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. దీంతో వెంకట్రామయ్యను అదే స్థానంతో మరో యేడాదిపాటు కొనసాగిస్తూ తితిదే ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్రామయ్యను ఏడాది పొడిగించడంపై యాదవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి