మంగళవారం నాడు ప్రదోషం వస్తే, దానిని భౌమ ప్రదోషం అంటారు. ఈ రోజున శివాలయాల్లో నందీశ్వరునికి, ఈశ్వరునికి ప్రత్యేక అభిషేకాదులు జరుగుతాయి. మంగళవారం నాడు వచ్చే ప్రదోషాన్ని రుణ విమోచన ప్రదోషం అని కూడా అంటారు. 'రుణం' అంటే అప్పులు 'విమోచన' అంటే ఉపశమనం కలుగుతుంది. అందువల్ల, రుణ విమోచన ప్రదోషం నాడు శివుడిని పూజించడం వల్ల ప్రతికూల రుణ కర్మలు తొలగిపోతాయి.
జీవితంలో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. అప్పులు, భయం, దుఃఖం, కుటుంబ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దేవాలయాలు, ఇళ్లలో ప్రదోష సమయంలో (సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు) శివపూజ చేయడం మంచిది.
వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం భౌమ ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. భౌమ ప్రదోషం రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్ర వచనం.
సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకం, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి. ప్రదోష వ్రతం కథ చదువుకోవడం లేదా వినడం చేయాలి. ఆ తర్వాత శివునికి భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. చివరగా "ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు.