చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున సీతాదేవితో ఆయన వివాహం జరిగింది. త్రేతాయుగంలో జరిగిన ఈ ఘటనను తలచుకుంటూ నేటికీ ఊరూరా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ, పూజిస్తుంటాం. అయితే ఈసారి శ్రీరామనవమి విషయంలో నవమి ఘడియలు చర్చనీయాంశమైనాయి.
అష్టమితో కలిసివచ్చే నవమి ఘడియల్లో స్వామికి, అమ్మవార్లకు కల్యాణం జరిపించే ఆనవాయతీ లేదని, నిన్న ఉదయం వరకూ అష్టమి ఘడియలు ఉన్నందున ఆదివారం జరిపిస్తున్నామని భద్రాచలం అధికారులు స్పష్టం చేశారు. దశమి ఎంతో మంచి రోజని, అష్టమి సూర్యోదయానికి ముందే వెళ్లిపోతే మాత్రమే ఆ రోజున కల్యాణం జరిపించాలే తప్ప, సూర్యోదయం తరువాత అష్టమి ఉంటే అదే రోజున స్వామివారి వివాహ మహోత్సవాన్ని నిర్వహించరాదని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు స్వామి, అమ్మవారికి సమర్పించారు. సీతారాముల కల్యాణ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భద్రాద్రి ఆలయం కిటకిట లాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు.