కర్ణాటక కాబోయే సీఎం కుమారస్వామి భార్య రాధికను హీరోయిన్‌గా పరిచయం చేసింది జూబిలీహిల్స్ శాసన సభ్యుడు, సినీ నిర్మాత మాగంటి గోపినాథ్. ఇప్పుడు కర్ణాటక కొత్త సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం గం.12.30కు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలు హాజరవుతున్నారు.
ఇదిలావుండగా, కుమారస్వామి సీఎం అవుతున్న నేపథ్యంలో ఆయన భార్య రాధికా కుమారస్వామి గూగుల్‌లో ట్రెండ్ అవుతున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో రాధిక అందరికీ తెలుసు. ఆమె నటి మరియు నిర్మాతగా వ్యవహరించారు. పన్నెండేళ్ల క్రితం అంటే 2006లో ఆమె కుమారస్వామిని పెళ్లాడారు. వీరికి ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు షమిక కే స్వామి. రాధికా కుమార స్వామి 2002లో నీల మేఘ శ్యామతో కన్నడ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. అయితే హీరోయిన్‌గా తొలి చిత్రం 'భద్రాద్రి రాముడు".
ప్రస్తుత జూబిలీహిల్స్ శాసనసభ్యుడు, సినీ నిర్మాత మాగంటి గోపినాథ్ 2004లో రాధికా కుమారస్వామిని తన సొంత చిత్రం 'భద్రాద్రి రాముడు' చిత్రం ద్వారా పరిచయం చేసారు. ఈ చిత్రానికి దర్శకుడు సురేష్ కృష్ణ హీరో నందమూరి తారక రత్న. తొమ్మిదో తరగతి చదవగానే ఈ ఫీల్డులోకి వచ్చారు రాధిక. 31 ఏళ్ల రాధిక 30కి పైగా సినిమాలలో నటించారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. రాధిక రాజకీయాల్లోకి వస్తారని కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది. కానీ ఆమె సుముఖంగా లేరని కూడా అప్పుడే వార్తలు వచ్చాయి.
రాధికా కుమారస్వామి చివరగా నటించిన చిత్రం ఈశ్వర్. వివాహం నేపథ్యంలో ఆ సినిమా ఆ తర్వాత బయటకు రాలేదు. ఆమెకు 2006లో పెళ్లయింది. కుమారస్వామికి 58 ఏళ్లు. అతని భార్య రాధికా కుమారస్వామికి 31 ఏళ్లు. 2005లో రాధికా - కుమారస్వామిలకు పరిచయమైంది. 2006లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత అంటే 2010లో అందరికీ వివాహం గురించి తెలిసింది.
రాధిక, ఇటు కుమారస్వామిది.. ఇద్దరిదీ రెండో వివాహమే. రాధిక 2000లో రతన్ కుమార్‌ను పెళ్లాడారు. అప్పటికి ఆమె వయస్సు పద్నాలుగు. రెండేళ్లకు రతన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అతను 2002లో కన్నుమూశాడు. కుమారస్వామి 1986లో అనితను వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిల్ గౌడ(జాగ్వార్ మూవీ హీరో) కుమారుడు ఉన్నారు.