సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ వార్షిక వేడుకల్లో భాగంగా సోమవారం లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన 'రంగం' కార్యక్రమం నిర్వహించారు. బోనాల పండుగ తర్వాతి రోజు జరిగే ఈ ఘట్టంలో స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. లష్కర్ బోనాల సందర్భంగా పచ్చి కుండపై నిలబడి, అమ్మవారిని ఆవహించుకుని స్వర్ణలత భవిష్యత్తును చెప్పారు. ఈ యేడాది బంగారు బోనం కొంత సంతోషం, కొంత దుఃఖం కలిగించిందన్నారు.
ముఖ్యంగా 'ఈ యేడాది భక్తుల్లో సంతోషం కనపడలేదు. ఆడపడుచులు క్షోభిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తున్నామనుకుంటున్నారుగానీ కీడు చేస్తున్నారు' అని వెల్లడించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, తాను న్యాయం వైపు ఉండి దుష్టులను శిక్షిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలంతా తన బిడ్డలేన్న 'మాతంగి'.. ఈ ఏడాది కోరినన్ని వర్షాలుంటాయని, పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు.