తితిదే ఆలయాల్లో స్థానిక శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలి : జేఈఓ

శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:31 IST)
తితిదేకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ఉత్సవాలు, పర్వదినాల సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులు, భజన మండళ్ళు, వేదపారాయణందారుల సేవలను వినియోగించుకోవాలని తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. 
 
తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఉపమాక, అనంతవరం, ఒంటిమిట్ట, చంద్రగిరి, పిఠాపురం, నారాయణవనం, నగరి, అప్పలాయగుంటలోని తితిదే ఆలయాల పరిసర గ్రామాలు, మండలాల్లో శ్రీవారి సేవకులు, భజన మండళ్ళు, వేదపారాయణందారులను గుర్తించి వారి సేవలను వినియోగించుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. 
 
ఇలా చేయడం వల్ల తిరుపతి నుంచి సేవకులను, భజన మండళ్లను, వేదపారాయణందారులను పంపాల్సిన అవసరం ఉండదని చెప్పారు. స్థానికంగా ఉన్న వారి సేవలను వినియోగించడం ద్వారా వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని వివరించారు. పరిసర ప్రాంతాల వారు కావడంతో ఉత్సాహంగా ధర్మప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి