అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, స్కంద, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.
ఆ తర్వాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు.
ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, తిరుమల చిన్న జీయర్ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు మల్లీశ్వరి, విద్యాసాగర్ రావు, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు ఇతర అధికారులు పాల్గొన్నారు.