వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం నంచి తిరుమల వెంకన్నకు మినహాయింపునిచ్చే ప్రసక్తేలేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు. ఆయనకు మినహాయింపునిస్తే... దేశంలోని ఇతర దేవుళ్లకు కూడా ఇదే నియమాన్ని వర్తింపజేయాల్సి ఉంటుందన్నారు. అలాగే, తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించే వస్తువులపై కూడా పన్ను మినహాయింపు ఇవ్వలేమన్నారు.
అందువల్ల వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధి నుంచి తిరుమల దివ్యక్షేత్రాన్ని మినహాయించే ప్రసక్తేలేదని జైట్లీ స్పష్టంచేశారు. టీటీడీకి మినహాయింపు కుదిరేపనికాదని, టీటీడీని మినహాయిస్తే, దేశంలోని మిగతా సంస్థలన్నీ ఇదే కోరిక కోరతాయన్నారు.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆథ్యాత్మిక క్షేత్రమైన తిరుమలను మినహాయించాలని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జైట్లీకి వినతిపత్రాన్ని అందించారు. దీన్ని పరిశీలించిన జైట్లీ.. పైవిధంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే, యనమల సమర్పించిన వినతిపత్రంపై వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు.