అర కేజీ బరువుతో జన్మించిన పసికందుకు ప్రాణం పోసిన హైదరాబాద్ వైద్యులు

ఠాగూర్

శుక్రవారం, 22 ఆగస్టు 2025 (16:49 IST)
వైద్య రంగంలోనే అద్భుతాన్ని హైదరాబాద్ నగర వైద్యులు ఆవిష్కరించారు. 23 వారాలకే అర కేజీ బరువుతో జన్మించిన ఓ పసికందుకు హైదరాబాద్ వైద్యులు ప్రాణం పోశారు. దాదాపు నాలుగు నెలల పాటు మృత్యువుతో పోరాడిన ఆ శిశువు, సంపూర్ణ ఆరోగ్యంతో తల్లిదండ్రుల చెంతకు చేరాడు. భారత నియోనాటల్ వైద్య చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మక విజయమని వైద్యులు అభివర్ణించారు.
 
సూడాన్‌కు చెందిన ఇన్సాఫ్, షాకీర్ దంపతులు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చారు. ఆమె గర్భంలో మూడు పిండాలు పెరగ్గా, వాటిలో ఒకటి అభివృద్ధి చెందలేదు. మిగిలిన ఇద్దరు శిశువులు గత ఏప్రిల్ 18న, కేవలం 23 వారాలకే జన్మించారు. వారిలో ఒకరు పుట్టిన తొమ్మిదో రోజే మరణించారు. కేవలం 565 గ్రాముల బరువుతో ఉన్న రెండో శిశువునైనా కాపాడాలని హైటెక్ సిటీలోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రి వైద్యులు సంకల్పించారు.
 
వెంటనే శిశువును ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఎస్ఐసీయూ)కు తరలించి చికిత్స ప్రారంభించారు. చీఫ్ నియోనాటలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం 115 రోజుల పాటు పసికందును కంటికి రెప్పలా కాపాడింది. శిశువు గుండె, మెదడు, రెటీనా పనితీరును నిరంతరం పర్యవేక్షించారు. ఈ క్రమంలో 'పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్' అనే గుండె సంబంధిత సమస్యను గుర్తించి, మందులతో విజయవంతంగా నయం చేశారు.
 
సుదీర్ఘ చికిత్స అనంతరం శిశువు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడి, 2 కిలోల బరువుకు చేరుకున్నాడు. దీంతో ఆగస్టు 11న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత తక్కువ సమయంలో పుట్టిన శిశువులు బతకడం అత్యంత అరుదని ఆయన పేర్కొన్నారు. ఈ శిశువు ప్రాణాలు కాపాడటంలో వైద్యులు రాధిక, నవిత, వంశీరెడ్డి, ప్రశాంతి కీలక పాత్ర పోషించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు