వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే నిమిత్తం కొండపైకి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల సెలవు కావడంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అనేక మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఏడుకొండలపైకి వచ్చారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో నండిపోయాయి. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి కనీసం 30 గంటల సమయం పడుతుంది.
శుక్రవారం నుంచి మొదలైన రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రద్దీ ఆదివారం మరింతగా పెరిగింది. దీంతో తితిదే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శన టోకెన్లు లేనిభక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్-లోనే కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయాయి. వీరు స్వామి వారిని దర్శించుకునేందుకు 30 గంటలకుపైగా సమయం పడుతుంది.
తిరుమల కొండపై రద్దీ పెరగడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారు మాత్రమే కొండపైకి రావాలని విజ్ఞప్తి చేసింది. టోకెన్లు లేనివారు కొండపైకి వచ్చి ఇబ్బంది పడొద్దని వారు కోరారు. కాగా, స్వామివారిని శుక్రవారం 71 వేల 782 మంది దర్శనం చేసుకోగా, హిండీ కానుక ద్వారా శ్రీవారికి రూ.3.20 కోట్ల ఆదాయం వచ్చింది.