సావిత్రి-సత్యవంతుల ప్రేమ కథ

బుధవారం, 7 నవంబరు 2007 (17:14 IST)
హిందూ పురాణేతిహాసాలలో సావిత్రి-సత్యవంతుల ప్రేమ వృతాంత్తానికి ప్రత్యేక స్థానం ఉన్నది. తరాలు మారినా, మానవజీవన శైలిలో విన్నూత్నపోకడలు చోటు చేసుకున్నప్పటికీ వారిరువురి మధ్య అనురాగం ఆచంద్రతారార్కం నిలిచి ఉంటుంది.

గొప్పవాడైన ఒక మహారాజు అందాల కుమార్తె సావిత్రి. ఆమె సౌందర్యం నలుదిశలా వ్యాపించడంతో ఇతర రాజ్యాల రాజులు తమకు సావిత్రితో వివాహం జరిపించవలసిందిగా కోరుతూ సావిత్రి తండ్రికి వర్తమానాలు పంపించడం ప్రారంభించారు. అయితే రాజుల పరిణయ ప్రతిపాదనలను సావిత్రి నిరాకరించింది. తనకు సరియైన వరుని ప్రపంచమంతా తిరిగి తానే ఎంచుకుంటానని సావిత్రి తండ్రికి తెలిపింది. తండ్రి నియమించిన అంగరక్షకులు తోడుగా వరుని వెదికేందుకు సావిత్రి దేశాటన ప్రారంభించింది.

ఒకరోజు దట్టమైన అడవిలోకి ప్రవేశించిన సావిత్రి రాజ్యం కోల్పోయి అరణ్యవాసం చేస్తున్న అంధులైన రాజదంపతులను చూసింది. ఒక చిన్న పూరిపాకలో నివసిస్తున్న రాజదంపతులకు సేవలు చేస్తున్న వారి కుమారుడైన సత్యవంతుని గమనించింది. తల్లిదండ్రులను పోషించే నిమిత్తం అడవిలో కట్టెలను కొట్టి సమీపంలోని గ్రామంలో సత్యవంతుడు విక్రయిస్తాడు. సత్యవంతుని సావిత్రి తొలిచూపులోనే ప్రేమిస్తుంది.

తన అన్వేషణకు ముగింపు పలుకుతుంది. సిరిసంపదలు లేకుండా అరణ్యంలో జీవిస్తున్నసత్యవంతునికి సావిత్రిని ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి నిరాకరిస్తాడు. అంతేకాక వివాహమైన సంవత్సరకాలానికే సత్యవంతుడు మరణిస్తాడని పండితులు చెప్పడంతో సావిత్రి తండ్రి ఆందోళన చెందుతాడు. అయినా సావిత్రి వినకపోవడంతో వారిరువురి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాడు.

భర్తతో కలిసి అరణ్యానికి వెళుతుంది సావిత్రి. చూస్తుండగానే సంవత్సరకాలం గడిచిపోతుంది. సత్యవంతునికి మరణం ఆసన్నం అవుతున్నదన్న సంగతిని గ్రహించిన సావిత్రి, భర్తతో కలిసి కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళుతుంది. మధ్యాహ్నానికి కట్టెలు కొట్టి అలసిపోయిన సత్యవంతుడు, సావిత్రి ఒడిలో విశ్రమిస్తాడు. హఠాత్తుగా చీకట్లు కమ్ముకున్నాయి.

చీకట్లను చీల్చుకుంటూ యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. చూస్తుండగానే సత్యవంతుని ఆత్మను యమధర్మరాజు కైవసం చేసుకున్నాడు. వచ్చిన పని పూర్తి చేసుకుని ముందుగా సాగుతున్న యమధర్మరాజు వెంటపడింది సావిత్రి. తన భర్తను తనకు ఇవ్వమని యమధర్మరాజును వేడుకుంది సావిత్రి. పతి ప్రాణాన్ని తప్ప మరేదైనా కోరుకోమని సావిత్రిని ఆదేశిస్తాడు
యమధర్మరాజు. సంతానాన్ని ప్రసాదించవలసిందిగా వరమడుగుతుంది సావిత్రి. తథాస్తు అన్నాడు యమధర్మరాజు. తనను వెంటాడుతున్న సావిత్రిని సంగతేమిటని అడుగుతాడు యమధర్మరాజు. పతి లేకుండా సంతానం ఏమిటని లోకం ప్రశ్నిస్తుందని బదులిస్తుంది సావిత్రి..

ఆమె వరంలోని ధర్మసూక్ష్మాన్ని గ్రహించిన యమధర్మరాజు సత్యవంతునికి జీవం పోసి వెడలిపోతాడు. ప్రేమమూర్తి అయిన సావిత్రి, భర్త ప్రాణాల కోసం యమధర్మరాజును వెంటాడిన వైనం లోక ప్రసిద్ధమై ప్రేమజీవులకు ఆదర్శంగా నిలిచింది.

వెబ్దునియా పై చదవండి